భారత అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న, టీమ్ఇండియా క్రికెటర్ రోహిత్‌శర్మకు దక్కడంపై అతడి చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ఎంపికై గొప్ప ఘనత సాధించాడని అన్నారు. 2023 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ అద్భుత ప్రదర్శన చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
"రోహిత్‌కు ఖేల్‌రత్న దక్కడం గొప్ప ఘనత. పేద కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ప్రతిభ ఉంటే అది అతడి అదృష్టానికి దారితీస్తుంది. అలాంటి వ్యక్తి ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతాడు. దానికి ఉత్తమ ఉదాహరణే రోహిత్ శర్మ. అతడి కృషి, ప్రతిభ కారణంగానే గొప్ప క్రికెటర్‌గా ఎదిగాడు. రాబోయే వన్డే ప్రపంచకప్‌లో తన బ్యాటింగ్‌తో భారత్‌ను గెలుపు దిశగా చేరుస్తాడని భావిస్తున్నా"
-దినేష్ లాడ్, రోహిత్‌శర్మ చిన్ననాటి కోచ్
రోహిత్ శర్మలో ప్రతిభావంతుడిని తాను మొదట గుర్తించిన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కోచ్ దినేష్. "బోరివాలిలో ఓ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కొన్ని మ్యాచ్‌లను జరిపారు. అందులో నా పాఠశాల జట్టుతో రోహిత్ జట్టు ఫైనల్లో తలపడ్డాయి. రోహిత్ జట్టుపై మేం గెలిచాం. ఆ సమయంలో మా పాఠశాల జట్టు కొత్తది. టీమ్ కోసం పిల్లలను వెతుకుతున్నాను. అప్పుడు రోహిత్ శర్మ బౌలింగ్ విధానం నన్ను ఆకట్టుకుంది. అతడిని మా పాఠశాలకు తీసుకెళ్లాలని అనుకున్నాను" అని వెల్లడించారు.
రోహిత్‌శర్మ పాఠశాల ఫీజును కూడా తగ్గించేందుకు తాను సహకరించినట్లు లాడ్ వెల్లడించారు. "మా స్కూల్ డైరెక్టర్‌తో మాట్లాడి రోహిత్ ఫీజు మాఫీ చేయమని అడిగాను. ఆయన అందుకు అంగీకరించారు. ఆ సమయంలో నేను అలా చేసి ఉండకపోతే రోహిత్‌శర్మను మీరు చూసి ఉండేవారు కాదు. నేను చూసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ జాతీయ జట్టుకు ఆడతాడని ఊహించలేదు" అని దినేష్ తెలిపారు.