స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో నిషేధం ఎదుర్కొన్న క్రికెటర్ శ్రీశాంత్. ఈ బ్యాన్ సెప్టెంబర్‌తో ముగుస్తుంది. ఫలితంగా మళ్లీ క్రికెట్లోకి పునఃప్రవేశం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో కుటుంబంతో గడుపుతోన్న ఈ వివాదాస్పద బౌలర్ ఐపీఎల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఈటీవీ భారత్‌తో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొని పలు విషయాలు వెల్లడించాడు.
లాక్డౌన్ సమయంలో ఏ విధంగా గడుపుతున్నారు?
కేరళలో ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. మహమ్మారి నుంచి రాష్ట్రం కోలుకుంటోంది. ప్రాక్టీస్ కూడా జరుగుతోంది. కానీ వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. జూన్, జులై, ఆగస్టులో ఇక్కడ వర్షాలు ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల రంజీ ట్రోఫీ కోసం ఇండోర్‌లోనే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. లాక్డౌన్ సమయంలో ఇంటివద్దే ఉంటూ సరదాగా గడుపుతున్నా. పిల్లలను చూసుకుంటున్నా. ఇటీవలే ఓ కొత్త పెంపుడు కుక్కను కొనుక్కున్నా. బెంగళూరులో శ్రీశాంత్ స్పోర్ట్స్ అకాడమీ సెప్టెంబర్‌లో ప్రారంభంకానుంది.
భారత్‌కు మళ్లీ ఆడాలని భావిస్తున్నారా?
దేశం కోసం ఆడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అదో విభిన్న అనుభూతి. పొడవైన జుట్టు, మంచి ఫిట్నెస్తో జట్టులోకి రావాలని భావిస్తున్నా. ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో మొదలుపెట్టడమే నా లక్ష్యం. సెప్టెంబర్-అక్టోబర్‌లో దీనికి సంబంధించి ప్రాక్టీస్ మొదలుపెడతా. కేరళకు రంజీ, ఇరానీ ట్రోఫీ అందించాలని అనుకుంటున్నా. ఈ క్రమంలో భారత జట్టులో ఆడే అవకాశం లభిస్తే ఎంతో గొప్పగా భావిస్తా .
కొత్త జెర్సీతో బరిలో దిగుతున్నారా?
అవును. ఇంతకుముందు ధరించిన 36 జెర్సీకి బదులు ఇకనుంచి 369 నెంబర్‌తో బరిలోకి దిగబోతున్నా. నా కూతురు జన్మించింది మే 9. తన పేరు శ్రీసాన్విక. అంటే లక్ష్మీ. నా సతీమణి పేరు భువనేశ్వరి కుమారి. ఇంట్లో తనను నయన్ అని పిలుస్తా. అంటే అది కాస్తా నైన్ (9)గా అనిపిస్తుంది. అందుకే 369 అంకెతో జెర్సీ ధరించాలనుకుంటున్నా.
ఐపీఎల్ పునరాగమనం గురించి?
ఐపీఎల్లో ఆడినప్పుడే స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం బారినపడ్డా. అందుకే మళ్లీ లీగ్‌లో ఆడాలనుకుంటున్నా. కుంభకోణం నుంచి నిరపరాధిగా బయటకు రావడానికి దాదాపు రెండున్నరేళ్లు పట్టింది. మళ్లీ అనుమతి రావడానికి మరో నాలుగేళ్లు పడుతుంది. అందుకే నేను ఐపీఎల్లో మళ్లీ బరిలోకి దిగి.. ఎవరూ ఇలాంటి సాహసాలకు పాల్పడకూడదని చెప్పాలనుకుంటున్నా. క్రికెట్లో అడుగుపెట్టి ప్రేక్షకుల ప్రశంసలు అందుకునేందుకు ప్రయత్నిస్తా.