సచిన్ తెందూల్కర్ సలహా కోసం స్టార్ క్రికెటర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. అలాంటిది ఎల్బోగార్డ్ విషయంలో తనకు ఓ వ్యక్తి సలహా ఇచ్చాడని, ఆ సూచన తనకు ఎంతో ఉపయోగపడిందని ఇటీవల ట్వీట్ చేశాడు మాస్టర్. సచిన్‌కు సలహా ఇచ్చిన ఆ వ్యక్తి ఎక్కడున్నారో గుర్తించి... ప్రత్యేఖ ముఖాముఖి నిర్వహించింది ఈటీవీ భారత్.
చెన్నైలోని తాజ్ కోరమండల్ హోటెల్లో వెయిటర్‌గా పనిచేశారు గురుప్రసాద్ సుబ్రహ్మణ్యన్. 19 ఏళ్ల క్రితం ఎల్బోగార్డ్ విషయంలో సచిన్‌కు తానే సలహా ఇచ్చానని చెప్పారు. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుపెట్టుకోవడం మాస్టర్ గొప్పతనానికి నిదర్శనమని పొంగిపోయారు.
"మొదట సచిన్ తెందూల్కర్‌కు ధన్యవాదాలు చెప్పాలి. 19 ఏళ్ల తర్వాత కూడా నేను చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవడమే కాకుండా మళ్లీ ప్రస్తావించడం సాధారణమైన అంశం కాదు" -గురుప్రసాద్ సుబ్రహ్మణ్యన్
"నేను చెప్పిన సలహా గుర్తుంచుకునేంత పెద్దదేం కాదు. కానీ ఆ సంఘటనను మర్చిపోకుండా నన్ను కలవాలనుందని చెప్పిన సచిన్ ఔదార్యానికి ఆశ్చర్యమేసింది. ప్రపంచం ఇప్పటివరకు చూడని గొప్ప క్రికెటర్ మాస్టర్." -గురుప్రసాద్ సుబ్రహ్మణ్యన్