ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ను గెలిపించిన హీరోల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే పెద్దగా గణాంకాలు నమోదు చేయనప్పటికీ సిడ్నీ టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు భారత యువ పేసర్ నవ్‌దీప్ సైనీ. నాలుగు వికెట్లు తీసి చారిత్రక డ్రాలో భాగస్వామ్యమయ్యాడు. ఆ పర్యటన అనుభవాలు.. తన తదుపరి లక్ష్యాల గురించి ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా ముచ్చటించాడు సైనీ.
గాయాల పరిస్థితేంటి?
ఇప్పటికీ గాయాలతోనే ఉన్నా. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు వెళ్తా. ఆ తర్వాతే వాటి గురించి చెప్పగలను.
విరాట్ ఆస్ట్రేలియా నుంచి వెళ్లిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి పరిస్థితి నెలకొంది?
జట్టుగా ఆడటానికి కావాల్సిన 11మంది ఉన్నాం. నాకు పెద్ద తేడా అనిపించలేదు. ప్రదర్శన అన్నింటికన్నా ముఖ్యం. విరాట్ భయ్యా వెళ్లేటప్పుడు.. '110 శాతం మీరు ప్రయత్నించండి' అని చెప్పాడు. నా సహజశైలిలోనే ఆడమని నాకు సూచించాడు.
ఎవరైనా సీనియర్ క్రికెటర్‌ను మిస్ అయిన భావన కలిగిందా?
అది సహజం. ప్రాక్టీస్ చేసేటప్పుడు సీనియర్, జూనియర్ అనే బేధాలుండవు. ఒక కుటుంబంగా ఆడుతూ, ఒకరికొకరం సలహాలు ఇచ్చుకుంటాం. జూనియర్ల కోసం మంచి వాతావరణం ఉంటుంది. మ్యాచ్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో సీనియర్లు ముందుగానే వివరించి, అన్ని రకాల పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
మీరు మరచిపోలేని సంఘటన..
ఆస్ట్రేలియా పర్యటనే ప్రత్యేకం. వన్డేల్లో ఆడాను. టెస్టుల్లో అరంగేట్రం చేశాను. అది ఇంకా ప్రత్యేకం. సిరీస్ గెలవడం ఘనతగా భావిస్తున్నా. వికెట్లు తీశామా? లేదా? అనే దానికన్నా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడం నా వరకు ముఖ్యం. అరంగేట్రంలో తీసిన తొలి వికెట్ నా ఫేవరెట్.
సిరీస్‌కు ముందు, తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఏంటి పరిస్థితి?
గబ్బా టెస్టు చివరి రోజు అంతా సాధారణంగానే ఉంది. ఫలితం ఏదైనా సహజ ఆట ఆడాలని చర్చించుకున్నాం. ఎవరూ ఊహించని విధంగా రిషబ్ మ్యాచ్‌ను గెలిపించాడు. విజయానికి క్రికెటర్లు, సిబ్బంది చాలా కష్టపడ్డారు.