సీనియర్ బౌలర్లు రిటైరైతే బాధ్యతలు స్వీకరించడానికి యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని టీమ్‌ఇండియా పేసర్ మహ్మద్ షమీ అభిప్రాయపడ్డాడు. ఈ సంధి దశ సాఫీగా సాగుతుందనడానికి ఆస్ట్రేలియాలో చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంలో జూనియర్ బౌలర్ల ప్రదర్శనే నిదర్శనమని తెలిపాడు.
సీనియర్ బౌలర్లు రిటైరైనా ఇబ్బంది లేదు: షమీ - యంగ బౌలర్ల గురించి షమీ
జూనియర్ బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉందని కొనియాడాడు టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ. సీనియర్ బౌలర్లు రిటైరైతే ఆ బాధ్యతలు స్వీకరించడానికి యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని అన్నాడు.
"మేం రిటైరయ్యే సమయానికి బాధ్యతలు స్వీకరించేందుకు యువ బౌలర్లు సిద్ధంగా ఉంటారు. ఎంత ఎక్కువగా ఆడితే అంత బాగా రాటుదేలుతారు. మేము ఆటకు దూరమైనప్పుడు సంధి దశ సాఫీగా సాగుతుందని భావిస్తున్నా. పేరున్న ఆటగాడు రిటైరైనా జట్టు ఇబ్బంది పడబోదు. రిజర్వ్ బెంచ్ పటిష్టంగా ఉంది. అనుభవం ఎల్లప్పుడూ అవసరమే. త్వరలోనే యువ ఆటగాళ్లు అనుభవం సంపాదిస్తారు. బయో బబుల్ వాతావరణం నేపథ్యంలో నెట్ బౌలర్లుగా తీసుకెళ్లడం యువ ఆటగాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది" అని షమీ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో షమీ, బుమ్రా, ఇషాంత్, ఉమేశ్‌యాదవ్‌ల గైర్హాజరీలో మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్‌లు సత్తాచాటిన సంగతి తెలిసిందే.