తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​ జట్టుపై జెఫ్రీ విమర్శ- కోహ్లీతో విభేదించిన కుక్​ - అహ్మదాబాద్​ను అడిలైడ్​ అనుకున్న ఇంగ్లాండ్

ఇంగ్లాండ్ జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆ జట్టు మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్​కాట్. అహ్మదాబాద్​ను అడిలైడ్​గా భావించి ఆడారని విమర్శించాడు. మరోవైపు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్​ కుక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పిచ్​ విషయంపై టీమ్​ఇండియా సారథి కోహ్లీ చేసిన వ్యాఖ్యలను విభేదించాడు.

England would have thought Ahmadabad as Adelaide comments Geoffrey boycott
'అహ్మదాబాద్‌ను అడిలైడ్‌గా భ్రమపడ్డ ఇంగ్లాండ్‌'

By

Published : Feb 26, 2021, 11:01 PM IST

మొతేరాలో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ఆ జట్టు మాజీ క్రికెటర్‌ జెఫ్రీ బాయ్‌కాట్‌ తీవ్రంగా విమర్శించాడు. దాని ఫలితమే పది వికెట్ల తేడాతో పరాజయమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. గులాబి టెస్టును అహ్మదాబాద్‌లో కాకుండా అడిలైడ్‌లో ఆడుతున్నామని ఇంగ్లీష్ జట్టు భావించిందని పేర్కొన్నాడు.

అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన గులాబి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచులో టీమ్‌ఇండియా ముగ్గురు స్పిన్నర్లు అశ్విన్‌, అక్షర్‌, సుందర్‌ ఇద్దరు పేసర్లు ఇషాంత్‌, బుమ్రాతో బరిలోకి దిగింది. అయితే ఇంగ్లాండ్‌ మాత్రం ముగ్గురు పేసర్లు జేమ్స్‌ అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జోఫ్రా ఆర్చర్‌, ఒక స్పెషలిస్టు స్పిన్నర్‌ జాక్‌లీచ్‌ను ఎంపిక చేసింది. దాంతో కోహ్లీసేన ఎక్కువగా స్పిన్నర్లను ఉపయోగించుకోగా ఆంగ్లేయులకు ఆ అవకాశం లేకుండా పోయింది.

మూడో టెస్టులో ప్రదర్శన పట్ల ఇంగ్లాండ్‌ సిగ్గుపడాలని బాయ్‌కాట్‌ విమర్శించాడు. 'టర్నింగ్‌ పిచ్‌పై ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలన్న అద్భుత ఆలోచన ఎవరిదో తెలుసుకోవాలని అనుకుంటున్నా. వారిందుకు సిగ్గుపడాలి. ఇంగ్లిష్‌ జట్టు గులాబి టెస్టును అహ్మదాబాద్‌లో కాకుండా అడిలైడ్‌లో ఆడుతున్నామని భ్రమపడి ఉంటుంది' అని ఆయన పేర్కొన్నాడు. అయితే అంతకు ముందు 'గులాబి బంతి టెస్టులో బంతిని స్వింగ్‌ చేసేందుకు ఊవిళ్లూరుతున్నాం.' అని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అన్నాడు.

కోహ్లీతో విభేదించిన కుక్‌

మరోవైపు.. మొతేరా పిచ్‌పై టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ వైఖరిని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ ప్రశ్నించాడు. వికెట్‌ బ్యాటింగ్‌కు అనువుగానే ఉందన్న అతడి వ్యాఖ్యలతో విభేదించాడు. అసలు అలాంటి పిచ్‌పై ఆడటమే ఎంతో కష్టమని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో​ ఇంగ్లిష్‌ జట్టు 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

'విరాట్‌ కోహ్లీ మొతేరా పిచ్‌కు మద్దతుగా మాట్లాడాడు. అది పిచ్‌గా లేదు. దానిపై బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. వికెట్‌ను పక్కన పెట్టి బ్యాట్స్‌మెన్‌ను నిందిస్తారా? పిచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అనుకూలించిందన్న విరాట్‌ అంచనా తప్పు' అని కుక్‌ అన్నాడు.

"విరాట్‌ కోహ్లీ, జోరూట్‌ మ్యాచ్‌లో ఆడారు. స్పిన్‌ను ఎదుర్కోగల గొప్ప ఆటగాళ్లూ ఉన్నారు. నిజమే, స్పిన్‌ను మెరుగ్గా ఆడటం నేర్చుకొనే క్రికెటర్లూ ఉన్నారు. కానీ దిగ్గజ ఆటగాళ్లూ స్పిన్‌ ఆడేందుకు ఇబ్బంది పడ్డారు కదా. బంతి స్కిడింగ్‌ అవుతున్నప్పుడు ఎరుపు బంతితో ఏమైనా తేడా ఉంటుందేమో చూడాలి. ఏదేమైనా భారత్‌లోని అన్నింటికన్నా ఈ పిచ్‌పై బంతి ఎక్కువగా టర్న్‌ అయిందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. చాలా బంతులు నేరుగా వచ్చాయి. అంటే టర్న్‌ అయిన బంతులు విపరీతంగానే అయ్యాయి" అని కుక్‌ తెలిపాడు.

మొతేరా పిచ్‌పై సరిగ్గా ఆడలేక చేతులెత్తేసిన ఇంగ్లాండ్‌కు మద్దతుగా కొందరు మాజీ క్రికెటర్లు మాట్లాడుతున్నారు. పిచ్‌ టెస్టులకు పనికిరాదని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇంగ్లాండ్‌లో సీమింగ్‌ పిచ్‌లపై పేసర్లు వికెట్లు తీసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని భారత మాజీలు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి:రోడ్​ సేఫ్టీ వరల్డ్ సిరీస్​ 2021: షెడ్యూల్​ ఇదే

ABOUT THE AUTHOR

...view details