మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. కెప్టెన్ హీథర్ నైట్ (108 నాటౌట్; 66 బంతుల్లో 13ఫోర్లు, 4 సిక్సర్లు) ఈ టోర్నీలో తొలి శతకం ఖాతాలో వేసుకుంది. బుధవారం కాన్బెర్రా వేదికగా జరిగిన ఈ పోరులో.. ఇంగ్లీష్ జట్టు 98 పరుగుల తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తుచేసింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 176 పరుగుల భారీస్కోరు సాధించింది. ఇంగ్లీష్ జట్టు కెప్టెన్, బ్యాట్స్ఉమన్ నైట్ శతకానికి తోడు సీవర్ (59 నాటౌట్) మంచి ప్రదర్శన చేసింది. వీరిద్దరి జోడి మూడో వికెట్‌కు 169 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు భారీస్కోరు అందించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అంతేకాకుండా ఈ ప్రదర్శనతో కెరీర్లో వేయి పరుగుల మైలురాయి చేరుకుంది నైట్.
ఛేదనలో థాయ్‌లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 78 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో ఓపెనర్ చాంటమ్ (32) టాప్‌స్కోరర్. ఇంగ్లాండ్ బౌలర్లలో అన్య (3/21), సీవర్ (2/5) ఆకట్టుకున్నారు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నైట్ నిలిచింది. మెగాటోర్నీ తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టుకు షాకిచ్చింది దక్షిణాఫ్రికా.
విండీస్‌ను ఓడించిన పాక్
బుధవారం జరిగిన మరో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించింది పాకిస్థాన్ జట్టు. తన తొలి మ్యాచ్‌లోనే 8 వికెట్ల తేడాతో కరీబియన్లను చిత్తుచేసింది పాక్. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 7 వికెట్లకు 124 పరుగులు చేసింది. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (43), షిమైన్ (43) బ్యాట్‌తో మెరిశారు. అనంతరం ఛేదనలో పాక్ 18.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జవేరియా ఖాన్ (35), కెప్టెన్ బిస్మా మరూఫ్ (38 నాటౌట్) బ్యాటింగ్‌లో సత్తాచాటి జట్టును గెలిపించారు.