ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో రెచ్చిపోయిన వెస్టిండీస్ బౌలర్లకు రెండో టెస్టులో నిరాశ తప్పలేదు. సిరీస్‌లో నిలవాలని పట్టుదలగా ఆడిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్.. తొలి ఇన్నింగ్స్‌లో పేసర్ల సహనాన్ని పరీక్షించారు. బర్న్స్ (15), క్రాలే (0) విఫలమైనా.. కెప్టెన్ రూట్ (23) పోరాటం ఎక్కువసేపు నిలవకపోయినా.. సిబ్లే (86*), బెన్ స్టోక్స్ (59*) పోరాటం సాగించారు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంగ్లాండ్ జట్టులో రూట్ వచ్చాడు. పేసర్లు ఆర్చర్, అండర్సన్, వుడ్ స్థానంలో సామ్ కరన్, వోక్స్, బ్రాడ్ జట్టులోకొచ్చారు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు:
తొలి టెస్టు మాదిరే రెండో టెస్టూ వర్షం కారణంగా తొలిరోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి సెషన్‌లో 90 నిమిషాల తర్వాత కానీ పిచ్‌పై బంతి పడలేదు. ఓవైపు మబ్బులు.. మరోవైపు అనూహ్యమైన బౌన్స్ ఉన్న స్థితిలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను చాలా జాగ్రత్తగా మొదలుపెట్టింది. పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడంలో కరీబియన్ పేసర్లు ఆరంభంలో విఫలమయ్యారు. తొలి టెస్టులో 9 వికెట్లు తీసిన గాబ్రియెల్ లయను దొరకబుచ్చుకోవడానికి సమయం తీసుకున్నాడు. విండీస్ పేసర్లు తడబడుతున్నా ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ మాత్రం వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఓపెనర్ బర్న్స్ 21వ బంతికి తొలి పరుగు తీశాడంటే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. విరామానికి ముందు ఇన్నింగ్స్ 14వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన స్పిన్నర్ రోస్టన్ ఛేజ్ ఇంగ్లాండ్‌ను గట్టి దెబ్బే కొట్టాడు. రెండో బంతికి బర్న్స్‌ను ఎల్బీగా ఔట్ చేసి విండీస్‌కు బ్రేక్ ఇచ్చాడు. బర్న్స్ సమీక్ష కోరినా ఫలితం లేకపోయింది. ఈ వికెట్ పడిన తర్వాత ఇంగ్లాండ్ 29/1తో లంచ్‌కు వెళ్లింది. విరామం తర్వాత వెంటనే ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోయింది. తన ఓవర్‌ను కొనసాగించిన ఛేజ్.. మూడో బంతికి క్రాలే (0)ను పెవిలియన్ చేర్చాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే లెగ్‌స్లిప్‌లో హోల్డర్ పట్టిన ఓ చురుకైన క్యాచ్‌కు క్రాలే ఔటయ్యాడు. అయితే ఛేజ్‌కు హ్యాట్రిక్ కాకుండా రూట్ అడ్డుకున్నాడు.