తెలంగాణ

telangana

ETV Bharat / sports

మూడో టెస్టు:తడబడి నిలిచిన ఇంగ్లాండ్​

మూడో టెస్టు తొలి రోజు 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది ఇంగ్లాండ్​. ఓవైపు బ్యాట్స్​మెన్ ఔట్​ అవుతున్నా మ్యాచ్​ను చేజారిపోకుండా కాపాడారు పోప్​, బట్లర్​ ద్వయం.

England vs West Indies 2020, 3rd Test, Day 1 at Manchester Highlights
ఇంగ్లాడ్​, వెస్టిండీస్​

By

Published : Jul 25, 2020, 6:42 AM IST

తొలి ఓవర్లోనే వికెట్‌ పడిపోయింది. 130లోపే నాలుగు వికెట్లు కూలాయ్‌! కెప్టెన్‌ రూట్‌ నిష్క్రమించాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న బెన్‌ స్టోక్స్‌ పెద్ద స్కోరు చేయకుండానే పెవిలియన్‌ చేరాడు. అయినా వెస్టిండీస్‌తో ఆఖరిదైన మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌ నిలిచింది. మెరుగైన స్కోరుతో తొలిరోజు ఆటను ముగించింది. కారణం ఒలీ పోప్‌.! క్లిష్ట స్థితిలోనూ గొప్పగా ఆడిన ఈ కుర్రాడు.. జోస్‌ బట్లర్‌తో కలిసి మొదటిరోజే ఇంగ్లాండ్‌ కుప్పకూలకుండా అడ్డుకున్నాడు. మరి రెండోరోజు ఈ ద్వయం ఎంతసేపు నిలుస్తుందనేదానిపైనే ఇంగ్లీష్​ జట్టు భారీ స్కోరు ఆధారపడి ఉంది.

మాంచెస్టర్​ వేదికగా జరుగుతున్న ఈ పోరులో.. సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే మూడో టెస్టులో తొలిరోజు ఇంగ్లాండ్‌ తడబడి నిలబడింది. ఆరంభంలో విండీస్‌ బౌలర్ల ధాటికి క్రమక్రమంగా వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు ఒలీ పోప్‌ (91 బ్యాటింగ్‌; 142 బంతుల్లో 114), బట్లర్‌ (56 బ్యాటింగ్‌; 120 బంతుల్లో 54, 26) కీలక భాగస్వామ్యంతో కోలుకుంది. ఈ జోడీ అభేద్యమైన అయిదో వికెట్‌కు 136 పరుగులు జత చేయడం వల్ల శుక్రవారం ఆట ఆఖరికి ఇంగ్లిష్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 85.4 ఓవర్లలో 4 వికెట్లకు 258 పరుగులు చేసింది. బర్న్స్‌ (57) అర్ధసెంచరీ చేసి నిష్క్రమించగా, సిబ్లీ (0), రూట్‌ (17), స్టోక్స్‌ (20) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.

వాళ్లిద్దరూ కాసేపు

అంతకుముందు వరుసగా మూడో టెస్టులోనూ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కరీబియన్‌ జట్టు.. ఆరంభం నుంచీ ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. స్వింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై కరీబియన్‌ పేసర్లు విజృంభించారు. తొలి ఓవర్‌ ఆఖరి బంతికే సిబ్లీ రూపంలో ఇంగ్లాండ్‌ వికెట్‌ కోల్పోయింది. వికెట్లపైకి దూసుకొచ్చేలా రోచ్‌ వేసిన బంతిని డిఫెన్స్‌ ఆడడంలో విఫలమైన సిబ్లీ అడ్డంగా దొరికిపోయాడు. సమీక్ష కోరకుండానే అతను పెవిలియన్‌ చేరడంలో ఇంగ్లాండ్‌ 1/1తో నిలిచింది.తొలి ఓవర్లోనే వికెట్‌ పడడంతో ఇంగ్లిష్‌ బృందం ఆత్మరక్షణలో పడింది. ఓపెనర్‌ బర్న్స్‌తో పాటు కెప్టెన్‌ రూట్‌ ఆచితూచి ఆడారు. ఆఫ్‌సైడ్‌ లోగిలిలో బంతులు వేస్తూ విండీస్‌ పేసర్లు పరీక్షించినా వాళ్లు పరుగుల కోసం తొందరపడలేదు. ఈ దశలో 59 బంతులు ఆడి 17 పరుగులు చేసిన రూట్‌ అనూహ్యంగా రనౌట్‌ కావడం ఇంగ్లాండ్‌ను దెబ్బ తీసింది.

పెద్ద చేపను పట్టేశారు

రెండో టెస్టులో అద్భుత శతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను విండీస్‌ వ్యూహంతో పడగొట్టింది. రూట్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఈ లఫె్ట్‌హ్యాండర్‌ను కరీబియన్‌ పేసర్లు షార్ట్‌ పిచ్‌ బంతులతో పరీక్షించారు. స్వింగ్‌తో ఇబ్బంది పెట్టారు. వీటిని తట్టుకుని స్టోక్స్‌ నిలవడంతో ఇంగ్లాండ్‌ 66/2తో లంచ్‌కు వెళ్లింది. విరామం తర్వాత స్టోక్స్‌కు రౌండ్‌ ద వికెట్‌ బౌలింగ్‌ చేస్తూ అతడికి ఊరించే బంతులేశారు అలా స్టోక్స్‌ ఒక అద్భుతమైన బంతికి దొరికిపోయాడు. వరుసగా రెండు బౌన్సర్లు వేసిన పేసర్‌ రోచ్‌.. ఉన్నట్టుండి ఓ ఇన్‌స్వింగర్‌ని సంధించగా.. బంతి గమనాన్ని సరిగా అంచనా వేయలేకపోయిన స్టోక్స్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

కార్న్‌వాల్‌ సూపర్‌ క్యాచ్‌

భారీ కాయుడు.. పైగా ఉన్నది స్లిప్‌లో ఎంత వేగంగా స్పందించాలి! కానీ వెస్టిండీస్‌ జంబో ఆటగాడు కార్న్‌వాల్‌ మాత్రం చురుగ్గా స్పందించి ఓ సూపర్‌ క్యాచ్‌తో క్రీజులో కుదురుకున్న బర్న్స్‌ను పెవిలియన్‌ చేర్చడంలో ముఖ్యపాత్ర పోషించాడు. స్పిన్నర్‌ ఛేజ్‌ బంతిని కట్‌ చేయడానికి బర్న్స్‌ ప్రయత్నించగా.. స్లిప్‌లోకి వచ్చిన క్యాచ్‌ను కార్న్‌వాల్‌ చటుక్కున పట్టేశాడు. దీంతో ఇంగ్లాండ్‌ 122/4తో కష్టాల్లో పడింది. ఈ సిరీస్‌లో బర్న్స్‌ను ఔట్‌ చేయడం ఛేజ్‌కు ఇది మూడోసారి కావడం విశేషం. టీ సమయానికి 131/4తో నిలిచిన ఇంగ్లిష్‌ జట్టు.. విరామం తర్వాత కాస్త పుంజుకుంది. బట్లర్‌ సహకారంతో పోప్‌ ఇన్నింగ్స్‌ నిర్మించాడు. అతను వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టి స్కోరు బోర్డు కదిలించాడు. మరోవైపు కుదురుకున్నాక బట్లర్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. ఈ క్రమంలోనే పోప్‌ 77 బంతుల్లో అర్ధసెంచరీ చేయగా.. బట్లర్‌ 104 బంతుల్లో ఈ మార్కు దాటాడు.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌

బర్న్స్‌ (సి) కార్న్‌వాల్‌ (బి) ఛేజ్‌ 57; సిబ్లీ ఎల్బీ రోచ్‌ 0; రూట్‌ రనౌట్‌ 17; స్టోక్స్‌ (బి) రోచ్‌ 20; పోప్‌ బ్యాటింగ్‌ 91; బట్లర్‌ బ్యాటింగ్‌ 56; ఎక్స్‌ట్రాలు 17: మొత్తం: (85.4 ఓవర్లలో 4 వికెట్లకు) 258; వికెట్ల పతనం: 1-1, 2-47, 3-92, 4-122; బౌలింగ్‌: రోచ్‌ 18.4-2-56-2; గాబ్రియెల్‌ 18-4-47-0; హోల్డర్‌ 20-5-45-0; కార్న్‌వాల్‌ 21-4-71-0; ఛేజ్‌ 8-2-24-1

ABOUT THE AUTHOR

...view details