ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో పాకిస్థాన్ మెరుగైన స్థితిలో నిలిచింది. పట్టుబిగించడానికి ప్రయత్నిస్తోంది. ఓపెనర్ షాన్ మసూద్ 156 (319 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత శతకం సాధించాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసింది పాక్. అనంతరం బంతితోనూ విజృంభించి.. ఆతిథ్య జట్టును చిక్కుల్లోకి నెట్టింది. పాక్ పేసర్ల ధాటికి తడబడ్డ ఇంగ్లాండ్.. రెండో రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
బర్న్స్ (4), సిబ్లే (8), స్టోక్స్ (0), రూట్ (14) వెనుదిరిగారు. పోప్ (46), బట్లర్ (15) క్రీజులో ఉన్నారు. అబ్బాస్ రెండు వికెట్లు పడగొట్టాడు.
మసూద్ అదరహో..:
పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఓపెనర్ షాన్ మసూద్ (ఓవర్‌నైట్ 46) ఆటే హైలైట్. ఇంగ్లాండ్ పేస్‌ను తట్టుకుని నిలిచి పాక్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది అంటే కారణం మసూదే. మరోవైపు వికెట్లు పోతున్నా పట్టుదలగా నిలిచిన అతడు.. సిసలైన టెస్టు ఇన్నింగ్స్ ఆడాడు. అత్యంత సహనంతో బ్యాటింగ్ చేసి చక్కని శతకం సాధించాడు.
ఉదయం 139/2తో ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్.. కాసేపట్లోనే చిక్కుల్లో పడింది. తొలి రోజు మెరుగ్గా బ్యాటింగ్ చేసిన బాబర్ అజామ్.. గురువారం తొలి ఓవర్లోనే ఔటయ్యాడు. అండర్సన్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చాడు. లంచ్ సమయానికి పాక్ 187/5తో నిలిచింది అసద్ షఫిక్ (7).. బ్రాడ్‌కు చిక్కగా, రిజ్వాన్ (9)ను వోక్స్ వెనక్కి పంపాడు. కానీ జోరుమీదున్న ఇంగ్లాండ్ బౌలర్లకు అడ్డుకట్టు వేస్తూ.. పాకిస్థాన్‌ను మసూద్ ఆదుకున్నాడు.
షాదాబ్ ఖాన్ 45(76 బంతుల్లో 3 ఫోర్లు)తో ఆరో వికెట్‌కు 105 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దాడు. రెండో రోజు మరో 48 పరుగులు చేరే సరికే ముగ్గురు సహచరులు వెనుదిరగడం వల్ల మసూద్ చాలా జాగ్రత్తగా ఆడాడు. దుర్భేద్యమైన డిఫెన్స్‌తో బౌలర్లను ఎదుర్కొన్నాడు. అతడు ఈ ఇన్నింగ్స్‌లో ఆడినన్ని బంతులను ఇంగ్లాండ్‌లో గత 24 ఏళ్లలో ఏ పాక్ ఓపెనర్ కూడా ఆడలేదు.
నిజానికి మొదటి రోజు కంటే మసూద్ వేగం పెంచాడు. 156 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన అతడు.. 251 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. మసూద్ మరో 60 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయిని చేరుకోవడం విశేషం. తనకు చక్కని సహకారమిచ్చి, పాక్‌ను నిలపడంలో తన వంతు పాత్ర పోషించిన షాదాబ్ ఖాన్‌తో పాటు.. యాసిర్ షా (5), అబ్బాస్ (0) పది పరుగుల వ్యవధిలో ఔట్ కావడం వల్ల మసూద్ దూకుడు పెంచాడు. ముచ్చటైన షాట్లతో అలరించాడు. స్పిన్నర్ డామ్ బెస్ ఓవర్లో రెండు సిక్స్‌లు, ఫోర్ దంచాడు. జట్టు స్కోరును మూడొందలు దాటించాడు.
పాక్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన మసూద్ చివరికి తొమ్మిదో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. బ్రాడ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. బ్రాడ్ అదే ఓవర్లో నసీమ్ షాను కూడా ఔట్ చేసి పాక్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. బ్రాడ్, ఆర్చర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
సయీద్ అన్వర్ (1996) తర్వాత.. ఇంగ్లాండ్‌లో టెస్టు శతకం సాధించిన తొలి పాక్ ఓపెనర్‌గా మసూద్ ఘనత సాధించాడు. మసూద్‌కు ఇది వరసగా మూడో టెస్టు శతకం. నిరుడు డిసెంబరులో శ్రీలంకపై 135 చేసిన అతడు.. తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌పై 100 కొట్టాడు.
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 326 (మసూద్ 156, బాబర్ అజామ్ 69, షాదాబ్ ఖాన్ 45, అబిద్ అలీ 16; బ్రాడ్ 3/54, ఆర్చర్ 3/59, వోక్స్ 2/43);
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 92/4 (పోప్ 46 బ్యాటింగ్, బట్లర్ 15 బ్యాటింగ్, రూట్ 14; మహ్మద్ అబ్బాస్ 2/24, షహీన్ అఫ్రిది 1/12, యాసిర్ షా 1/36.