శ్రీలంకతో జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ సారథి జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగి వరుసగా రికార్డులు నమోదు చేశాడు. ఇటీవలే టెస్టు క్రికెట్లో తమ జట్టు తరఫున అత్యధికంగా 8వేల పరుగులు చేసిన ఆరో బ్యాట్స్‌మన్‌గా నిలచిన ఇతడు.. తాజాగా ఆ రికార్డులో అడుగు ముందుకు జరిగి మరో మైలురాయిని చేరుకున్నాడు. తమ జట్టు మాజీ ఆటగాళ్లు డేవిడ్ గోవర్(8,231), కెవిన్ పీటర్సన్(8,181) వెనక్కునెట్టి అత్యధికంగా 8,238 పరుగులు సాధించిన ఇంగ్లాండ్ నాలుగో క్రికెటర్‌గా నిలిచాడు.
శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో ఈ ఫీట్‌ను అందుకున్నాడు రూట్. ఈ మ్యాచులో అతడు (186; 309 బంతుల్లో 18×4) పరుగులు చేసి శతకాన్ని నమోదు చేశాడు. ఈ పోరు అతడికి 99వది కాగా.. కెరీర్లో 19వ సెంచరీ. అంతకముందు తొలి టెస్టులో డబుల్ సెంచరీ చేశాడు.
ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో ఆ జట్టు మాజీ సారథి అలిస్టర్ కుక్(12,477) ఉండగా.. గ్రాహం గూచ్(8,900), అలెక్ స్టీవార్ట్(8,463) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్(15,921) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రికీ పాంటింగ్(13,378), జాక్వెస్ కల్లీస్(13,289), రాహుల్ ద్రవిడ్(13,288) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
శ్రీలంకతో సిరీస్ పూర్తవ్వగానే ఇంగ్లాండ్ భారత పర్యటనకు రానుంది. టీమ్ఇండియాతో నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫిబ్రవరి 5న ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి:జెఫ్రీ బాయ్‌కాట్‌ను అధిగమించిన రూట్