కరోనా కాలంలో విశేష సేవలందిస్తోన్న వారిని గౌరవిస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్టు(ఈసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సమయంలో కొవిడ్ సేవకుల పేర్లతో కూడిన చొక్కాలను ధరిస్తారని వెల్లడించింది.
స్థానిక క్రికెట్ క్లబ్‌ల ద్వారా చొక్కాలపై ఉన్న పేర్లకు సంబంధించిన వ్యక్తులను నామినేట్ చేసినట్లు ఈసీబీ తెలిపింది. వీరిలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సులు, సామాజిక కార్యకర్తలు తదితరులు ఉన్నట్లు పేర్కొంది.
"మేము ఎంతగానో ఇష్టపడే క్రికెట్ ఆడే సమయంలో.. క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న ధైర్యవంతులైన కొవిడ్ సేవకులను గౌరవించడానికి సమయం కేటాయించాలనుకుంటున్నాం. వారిని గౌరవించడానికి దీనిని మంచి అవకాశంగా భావిస్తున్నాం. వారి పేర్లను మేము గర్వంగా ధరిస్తాం."
-జోరూట్, ఇంగ్లాండ్ కెప్టెన్