నవంబరులో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగనుంది. దక్షిణాఫ్రికాలో ఇటీవలే ప్రయాణ ఆంక్షలు తొలగడం వల్ల బయో-బబుల్‌ను ఏర్పాటు చేసి ఈ సిరీస్ నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి.
ఇంగ్లాండ్- దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్
ఇంగ్లాండ్ క్రికెటర్లు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేందుకు అడ్డంకులు తొలగాయి. నవంబరులో పరిమిత ఓవర్ల సిరీస్‌ను నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్ల కోసం దక్షిణాఫ్రికా ప్రభుత్వం నిబంధనలను సడలించనుంది.
కరోనా కేసులు అధికంగా ఉన్న 22 దేశాల నుంచి ప్రయాణికులను దక్షిణాఫ్రికాకు అనుమతించడం లేదు. ఆ జాబితాలో బ్రిటన్ కూడా ఉంది. కానీ, ఈ పర్యటనలో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం నిబంధనలను సడలించింది. ఈ సిరీస్‌లో భాగంగా సఫారీ జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లను ఇంగ్లాండ్ ఆడనుంది. అందులో నాలుగు మ్యాచ్‌లను కేప్ టౌన్లో ఆడనుండగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లకు పార్ల్ వేదిక కానుంది.
నవంబరు 16న ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్ క్రికెటర్లు దక్షిణాఫ్రికా చేరనున్నారు. టీ20లు నవంబరు 27, 29, డిసెంబరు 1న జరగనుండగా.. వన్డేలు డిసెంబరు 4, 6, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇంగ్లాండ్ క్రికెటర్లు దక్షిణాఫ్రికా చేరిన తర్వాత వారం రోజుల పాటు నిర్బంధంలో ఉంటారు. కానీ, ఆ సమయంలో ప్రాక్టీసుకు అనుమతిస్తారు.