పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ క్రికెటర్లు సోమవారం దక్షిణాఫ్రికాకు వెళ్లారు. కరోనా ప్రభావం తర్వాత సఫారీ గడ్డపై జరగనున్న తొలి అంతర్జాతీయ సిరీస్ ఇదే. అయితే ఆ దేశ క్రికెట్ బోర్డులోని అంతర్గత సంక్షోభం కారణంగా ఈ సిరీస్ నిర్వహణపై అనుమానాలు వస్తున్నాయి.
అలా అయితే నిషేధమే!
అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలతో దక్షిణాఫ్రికా బోర్డు సభ్యులందరూ గత నెలలో రాజీనామా చేశారు. తాత్కాలిక బోర్డు సభ్యులను నియమించాలనే క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) తిరస్కరించింది. ఇప్పటివరకూ ఈ విషయంలో ఐసీసీ కల్పించుకోలేదు కానీ.. సీఎస్ఏలో రాజకీయ జోక్యం ఉందని తేలితే అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా ఆ జట్టును నిషేధించే వీలుంది.
సిరీస్ నిర్వహణపై సందేహం
ఈ నేపథ్యంలో ఈ నెల 27న ఆరంభమయ్యే మూడు టీ20ల, వన్డేల సిరీస్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. "మున్ముందు ఏం జరగనుందోనని ఆశ్చర్యంగా ఉంది. కానీ, ఇంగ్లాండ్ డైరెక్టర్ ఆష్లే గైల్స్.. సిరీస్ సవ్యంగా సాగుతుందనే ఆత్మవిశ్వాసంతో ఉన్నామని మాతో చెప్పారు. ఈ సిరీస్ అనుకున్నట్లు జరుగుతుందని తెలిసి అందరూ ఆనందంగా ఉన్నారు. ఆటగాళ్లుగా బోర్డు విషయాల్లో మేం చేయడానికి ఏం లేదు. క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాం" అని బట్లర్ చెప్పాడు.
వన్డేలకు దూరం
దక్షిణాప్రికా చేరుకున్న తర్వాత ఇంగ్లాండ్ ఆటగాళ్లు 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. మరోవైపు టీ20లు ఆడిన తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్లనున్న స్టోక్స్, ఆర్చర్, బట్లర్ వన్డేలకు దూరమవనున్నారు.