మహమ్మారి కరోనా వైరస్ వల్ల ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేల మంది ప్రాణాలు కోల్పోగా.. భారత్‌లోనూ ఆ కేసుల సంఖ్య క్రమంగా పెరుగోతంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ ఓ ట్వీట్ చేశాడు. ఇది హిందీలో ఉండటం వల్ల సామాజిక మాధ్యమాల్లో స్పందన లభిస్తోంది.
" నమస్తే భారత్ మనమంతా కలిసి కరోనా వైరస్‌ను ఓడించేందుకు కలిసికట్టుగా ఉందాం. ప్రభుత్వం చెప్పిన మాటను తప్పకుండా పాటిద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించండి. ఇలాంటి సమయంలోనే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది".
-- కెవిన్ పీటర్సన్, ఇంగ్లాండ్ క్రికెటర్
అంతేకాకుండా తనకు హిందీ నేర్పించిన శ్రీవత్స గోస్వామి అనే క్రికెటర్‌కు పీటర్సన్ కృతజ్ఞతలు తెలిపాడు.
కొవిడ్ 19 వల్ల కలిగే ముప్పు ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే పలువురు భారత క్రికెటర్లు అవగాహన కల్పిస్తున్నారు. వైరస్ నివారణకు ప్రజలంతా స్వచ్ఛందంగా ప్రదాని మోదీ పిలుపునిచ్చిన 'జనతా కర్ఫ్యూ' పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 22న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు దేశ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. కరోనా వైరస్‌కు మందు లేదని, సామాజిక దూరం పాటించడం ద్వారానే ఆ మహమ్మారిని తరిమికొట్టొచ్చని క్రికెటర్లు ముక్తకంఠంతో చెప్తున్నారు.
ప్రజలు ఈ కర్ఫ్యూకు సహకరించాలని దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్, టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్, శిఖర్ ధావన్, పంత్, రాహుల్, ఉమేశ్, రహానె, కుల్దీప్ వంటి క్రీడాకారులు కోరారు. అంతేకాకుండా 'సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్' పేరుతో అనేక మంది సెలబ్రిటీలు తమ చేతులు కడుక్కొంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.