అమెరికాలో ఇటీవల ఓ పోలీస్ అధికారి కర్కశత్వానికి జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ మృతిచెందాడు. ఈ ఘటనకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై తాజాగా స్పందించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.. తాము జాతి వివక్షతకు పూర్తి వ్యతిరేకమని ట్విట్టర్లో వెల్లడించింది. నల్లజాతీయుడైన ఆర్చర్‌ను మరో ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు హత్తుకున్న చిత్రాన్ని జత చేసింది.
ప్లీజ్ గళం వినిపించండి..!
జార్జ్ ఫ్లాయిడ్ మృతిని ఖండిస్తూ.. తమ గళాన్ని వినిపించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో పాటు ఇతర దేశాల క్రికెట్ బోర్డులను కోరాడు వెస్టిండీస్ టీ20 జట్టు సారథి డారెన్ సామి. జాతి వివక్ష అమెరికాలోనే కాకుండా ప్రపంచమంతా వ్యాపించి ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ ఘటనపై వరుస ట్వీట్లు చేశాడు సామి.
వెస్టిండీస్ టీ20 జట్టు కెప్టెన్ డారెన్ సామి ట్వీట్లు
"నల్లజాతీయులు చాలా కాలం నుంచి ఈ బాధలను భరిస్తున్నారు. నేను సెయింట్ లూసియాలో ఉన్నప్పడు నాకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఒకవేళ మీరు నన్ను సహచరుడిగా చూస్తే జార్జ్ ఫ్లాయిడ్ మృతిని ఖండించి మాకు మద్దతుగా నిలవండి. ఐసీసీ, ప్రపంచంలోని క్రికెట్ బోర్డులు ఇక్కడ ఏం జరుగుతుందో చూడలేదా? దయచేసి ఇలాంటి సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడరా? ఇది అమెరికాకే పరిమితం కాదు. ప్రపంచం మొత్తం జరుగుతోంది ఇదే. నిశ్శబ్దంగా ఉండే సమయమిది కాదు. మీ గళం నేను వినాలనుకుంటున్నాను. నల్లజాతీయులపై జరుగుతున్న అన్యాయంపై క్రికెట్ ప్రపంచం స్పందించకపోతే.. వర్ణ వివక్షతకు వత్తాసు పలికినట్లే అవుతుంది" అని డారెన్ సామి ట్విట్టర్లో పేర్కొన్నాడు.
ఇదీ చూడండి...'క్రికెట్లోనూ జాతి వివక్ష ఉంది.. నేనే బాధితుడిని'