దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు విచిత్రమైన సమస్య ఎదురైంది. దాదాపు సగం మంది క్రికెటర్లు అనారోగ్యంతో బాధపడుతున్నారు. సెంచూరియన్‌లో ఇరుజట్లు తొలి టెస్టు ఆడుతున్నాయి. మూడో రోజైన శనివారం ఉదయం.. ఇంగ్లీష్ జట్టు సారథి జో రూట్, కీపర్ జోస్ బట్లర్ అసౌకర్యానికి గురయ్యారు. బట్లర్ అసలు మైదానంలోకే రాకపోవడం వల్ల బెయిర్‌స్టో వికెట్ కీపింగ్ చేశాడు. రూట్ కాసేపు ఫీల్డింగ్ చేసినప్పటికీ, డ్రింక్స్ విరామం రాగానే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు.
అస్వస్థతతో జాక్‌లీచ్, క్రిస్ వోక్స్, మార్క్‌వుడ్.. హోటల్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. వారికి తోడుగా ఇద్దరు సహాయ సిబ్బంది ఉన్నారు. మరో క్రికెటర్ ఒలివ్ పాప్ ఆరోగ్యం మెరుగైంది. సాధనకు హాజరయ్యే అవకాశం ఉంది.