ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ కెరీర్లో తొలి టీ20 శతకం నమోదు చేశాడు. నేపియర్ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో ఈ ఫీట్ సాధించాడు. ఇంగ్లీష్ జట్టు తరఫున వేగవంతమైన శతకం సాధించాడు. ఇప్పటివరకు అలెక్స్ హేల్స్(ఇంగ్లాండ్) 60 బంతుల్లో శతకమే ఈ జట్టుకు అత్యుత్తమం. మలన్ కేవలం 48 బంతుల్లోనే వంద పరుగులు(9 ఫోర్లు, 6 సిక్సర్లు) సాధించాడు.
రికార్డు భాగస్వామ్యం...
ఇదే మ్యాచ్‌లో ఇయాన్ మోర్గాన్‌తో కలిసి జట్టుకు తిరుగులేని భాగస్వామ్యం అందించాడు మలన్. టీ20 ఫార్మాట్లో తొలి వికెట్‌కు 182 పరుగులు చేసిందీ జోడీ. ఇదే ఇంగ్లాండ్ జట్టుకు అత్యధిక భాగస్వామ్య రికార్డు.
ఒక దశలో కివీస్ బౌలర్లపై రెచ్చిపోయిన మోర్గాన్.. మలన్ రికార్డు బ్రేక్ చేస్తాడని అనుకున్నారు. కానీ 41 బంతుల్లో 91 పరుగులు(7 ఫోర్లు, 7 సిక్సర్లు) సాధించి పెవిలియన్ చేరాడు. ఈ ప్రదర్శనతో వేగవంతమైన అర్ధశతకం ఇతడి ఖాతాలో చేరింది. గతంలో ఆసీస్‌పై బట్లర్ 22 బంతుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేయగా.. ఇతడు దాన్ని అధిగమించి 21 బంతుల్లోనే సాధించాడు.
సిరీస్ సమం...
మోర్గాన్, మలన్ దెబ్బకు టీ20ల్లో ఇంగ్లీష్ జట్టు అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 241 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నిర్ణీత ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది న్యూజిలాండ్. ఫలితంగా 76 రన్స్ తేడాతో విజయం సాధించింది మోర్గాన్ సేన. ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2 తేడాతో సమమైంది. నిర్ణయాత్మక చివరి మ్యాచ్ ఆక్లాండ్ వేదికగా నవంబర్ 10(ఆదివారం) జరగనుంది.