తెలంగాణ

telangana

ETV Bharat / sports

విండీస్​పై ఇంగ్లాండ్​ విజయం.. సిరీస్​ 1-1తో సమం

ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో ఇంగ్లీష్​ జట్టు అనూహ్యంగా విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్​ నుంచే ఆధిపత్యానికి ప్రయత్నించిన ఆతిథ్య జట్టు.. బ్యాటింగ్​, బౌలింగ్​తోనూ రాణించి కరీబియన్​​ జట్టును మట్టికరిపించింది. ఆఖరికి 113 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్​.. సిరీస్​ను 1-1తో సమం చేసింది.

ENG vs WI: England win by 113 runs, The series is now tied 1-1 going into the final Test.
వెస్టిండీస్​పై 113 పరుగుల తేడాతో ఇంగ్లాండ్​ విజయం

By

Published : Jul 21, 2020, 7:02 AM IST

ఒక రోజు ఆట పూర్తిగా రద్దయిపోయింది. ప్రత్యర్థికి ఫాలోఆన్‌లోకి నెట్టే ప్రయత్నమూ విఫలమైంది. ఇక ఇంగ్లాండ్‌ డ్రానందంతో సరిపెట్టుకోక తప్పదనే అనుకున్నారంతా! కానీ ఈ మ్యాచ్‌ గెలవకుంటే సిరీస్‌పై ఆశలు నిలవని స్థితిలో ఆతిథ్య జట్టు అద్భుతం చేసింది. చకచకా పరుగులు సాధించింది. ప్రత్యర్థికి సవాలు విసిరే లక్ష్యాన్ని నిలిపింది. ఒక రోజు కంటే తక్కువ వ్యవధి ఉన్నప్పటికీ.. ప్రత్యర్థిని నిలవనీయలేదు. బంతితో ఆద్యంతం ఒత్తిడిని కొనసాగిస్తూ.. అనుకున్నది సాధించింది. రెండో టెస్టులో విజయం సాధించి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

అంతర్జాతీయ క్రికెట్‌ పునరాగమన సిరీస్‌లో మరో ఆసక్తికర ఫలితం! మూడు టెస్టుల ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ బలంగా పుంజుకుంది. సౌథాంప్టన్‌లో వెస్టిండీస్‌ చేతిలో ఎదురైన అనూహ్య పరాభవానికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. మాంచెస్టర్‌లో సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు విండీస్‌కు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లీష్‌ జట్టు.. 198 పరుగులకే ఆలౌట్‌ చేసింది.

షర్మా బ్రూక్స్‌ 62(136 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్లాక్‌వుడ్‌ 55(88 బంతుల్లో 7 ఫోర్లు), హోల్డర్‌ 35(62 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్​) పోరాడినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు.

స్టువర్ట్‌ బ్రాడ్‌ (3/42), క్రిస్‌ వోక్స్‌ (2/34), బెన్‌ స్టోక్స్‌ (2/30), బెస్‌ (2/59) ప్రత్యర్థిని దెబ్బ తీశారు.

అంతకుముందు 37/2తో బ్యాటింగ్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌.. రెండో ఇన్నింగ్స్‌ను 129/3 వద్ద డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం (176) బాదిన బెన్‌ స్టోక్స్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ రెచ్చిపోయాడు. 57 బంతుల్లోనే 78 పరుగులు (4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. బౌలింగ్‌లోనూ రాణించిన స్టోక్స్‌నే 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు వరించింది. సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టు మాంచెస్టర్‌లోనే శుక్రవారం ఆరంభమవుతుంది.

ఆ జోడీ ఉన్నంతసేపూ..

85 ఓవర్లు 312 పరుగులు.. వెస్టిండీస్‌ విజయ సమీకరణం ఇది. ఈ స్థితిలో చివరి రోజు గెలుపు గురించి ఆలోచించడం కష్టమే. విండీస్‌ రెండో ఇన్నింగ్స్​ ఆరంభమైన తీరు చూస్తే.. గెలుపు సంగతి తర్వాత.. ఓటమి తప్పించుకోవడం కష్టమే అని అర్థమైపోయింది. బ్రాడ్‌, వోక్స్‌ల ధాటికి ఆ జట్టు 37 పరుగులకే 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌ టాప్ ‌స్కోరర్‌ బ్రాత్‌వైట్‌ (12)తో పాటు క్యాంప్‌బెల్‌ (4), హోప్‌ (7), చేజ్‌ (6) పెవిలియన్‌కు వరుస కట్టేశారు. మ్యాచ్‌ మూడో సెషన్‌ వరకు కూడా వెళ్లదని.. విండీస్‌కు అవకాశమే లేదని అనిపించింది.

అయితే ఈ దశలో బ్రూక్స్‌, బ్లాక్‌వుడ్‌ జోడీ.. గొప్ప పోరాటంతో జట్టుకు మళ్లీ డ్రా ఆశలు కల్పించింది. వీళ్లిద్దరూ 27.4 ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. విండీస్‌ 137/4తో మెరుగైన స్థితికి చేరుకుంది. ఈ జోడీ నిలకడ చూస్తే.. కరీబియన్‌ జట్టుకు నెమ్మదిగా గెలుపు ద్వారాలు కూడా తెరుచుకునేలా కనిపించింది. కానీ స్టోక్స్‌.. సరైన సమయంలో బ్లాక్‌వుడ్‌ వికెట్‌ తీసి ఇంగ్లాండ్‌ విజయానికి బాటలు పరిచాడు. డౌరిచ్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం.. బ్రూక్స్‌ కూడా 161 పరుగుల వద్ద ఏడో వికెట్‌ రూపంలో వెనుదిరగడం వల్ల ఇంగ్లాండ్‌ విజయం ఖాయమని తేలిపోయింది. 15 ఓవర్ల ఆట మిగిలుండగానే విండీస్‌ కథ ముగిసింది.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 469/9 డిక్లేర్డ్‌
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌:287; ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: బెన్‌ స్టోక్స్‌ నాటౌట్‌ 78; బట్లర్‌ (బి) రోచ్‌ 0; క్రాలీ (బి) రోచ్‌ 11; రూట్‌ రనౌట్‌ 22; పోప్‌ నాటౌట్‌ 12; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (19 ఓవర్లలో 3 వికెట్లకు) 129 డిక్లేర్డ్‌
వికెట్ల పతనం:1-1, 2-17, 3-90;

బౌలింగ్‌: రోచ్‌ 6-0-37-2; గాబ్రియెల్‌ 7-0-43-0; హోల్డర్‌ 4-0-33-0; జోసెఫ్‌ 2-0-14-0

వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌:క్యాంప్‌బెల్‌ (సి) బట్లర్‌ (బి) బ్రాడ్‌ 4; బ్రాత్‌వైట్‌ ఎల్బీ (బి) వోక్స్‌ 12; హోప్‌ (బి) బ్రాడ్‌ 7; బ్రూక్స్‌ ఎల్బీ (బి) కరన్‌ 62; చేజ్‌ ఎల్బీ (బి) బ్రాడ్‌ 6; బ్లాక్‌వుడ్‌ (సి) బట్లర్‌ (బి) స్టోక్స్‌ 55; డౌరిచ్‌ ఎల్బీ (బి) వోక్స్‌ 0; హోల్డర్‌ (బి) బెస్‌ 35; రోచ్‌ (సి) పోప్‌ (బి) బెస్‌ 5; జోసెఫ్‌ (సి) బెస్‌ (బి) స్టోక్స్‌ 9; గాబ్రియెల్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (70.1 ఓవర్లలో ఆలౌట్‌) 198
వికెట్ల పతనం: 1-7, 2-19, 3-23, 4-37, 5-137, 6-138, 7-161, 8-183, 9-192;

బౌలింగ్‌:బ్రాడ్‌ 15-5-42-3; వోక్స్‌ 16-3-34-2; కరన్‌ 8-3-30-1; బెస్‌ 15.1-3-59-2; స్టోక్స్‌ 14.4-4-30-2; రూట్‌ 1.2-1-0-0

ABOUT THE AUTHOR

...view details