తెలంగాణ

telangana

ETV Bharat / sports

పుట్టింది ఓ చోట.. ఆడుతోంది మరో చోట - imran tahir

క్రికెట్​లో ప్రతిభ, నైపుణ్యం ఉంటే చాలు అవకాశాలకు కొదవ లేదు. అయితే అవన్నీ ఉన్నా అదృష్టం, రాజకీయ మద్దతు ఉండాలి అప్పుడే గుర్తింపు, అవకాశాలు సొంతమవుతాయి. ఇలానే సొంత దేశంలో సరైన సహకారం దక్కక, తమలోని ప్రతిభకు గుర్తింపు దక్కించుకోలేకపోయిన కొందరు ఆటగాళ్లు.. మరోదేశం తరఫున ఆడి తమను నిరూపించుకున్నారు. ఆశ్రయం ఇచ్చిన దేశం తరఫున ఆడుతూ ఔరా అనిపించారు. పుట్టిన దేశం కంటే ఆదరించిన దేశం పేరుతోనే వెలుగొందుతూ ప్రస్తుతం సూపర్​స్టార్​లు అయ్యారు. అలాంటి వారి గురించే ఈ కథనం.

cricket telugu news
పుట్టింది ఓ చోట.. ఆడుతోంది మరో చోట

By

Published : Nov 25, 2020, 9:30 AM IST

క్రికెట్​.. ప్రపంచంలోనే ప్రాచుర్యం పొందిన ఓ ఆట. అలాంటిది ఓ దేశంలో పుట్టి.. మరో దేశంలో అదరగొట్టేశారు కొందరు ప్లేయర్లు. తనను ఆదరించిన దేశానికి ఒకరు ప్రపంచకప్​ తెస్తే.. మరొకరు ఆ దేశం పేరు ర్యాంకింగ్స్​లో మారు మోగేలా చేస్తున్నారు. అలా వేర్వేరు దేశాల తరఫున ఆడుతూ టాప్​ ఆటగాళ్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఎనిమిది మంది క్రికెటర్ల గురించే ఈ ప్రత్యేక కథనం.

ఇమ్రాన్​ తాహిర్​

బ్యాట్స్‌మెన్‌ను సులువుగా బోల్తా కొట్టించి, వేగంగా పరిగెత్తి సంబరాలు చేసుకునే తాహిర్ గురించి తెలియని క్రికెట్​ ప్రేమికులు ఉండరేమో! వయసులో పెద్దవాడైనా.. ఆటలోనూ, ఉత్సాహంలోనూ యువకుడే. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న తాహిర్​.. పుట్టింది పాకిస్థాన్​లోని లాహోర్​లో. 1979లో జన్మించిన ఈ సూపర్​స్టార్​.. కెరీర్​ ఆరంభంలో పాక్​ జట్టు తరఫున కొన్ని మ్యాచ్​లు ఆడాడు. పాక్ అండర్​-19 జట్టులోనూ రాణించిన ఇతడు.. పాకిస్థాన్​-ఏ జట్టు తరఫున సత్తా చాటాడు. అయితే అతడి ప్రదర్శనకు ఆ సమయంలో పెద్దగా మార్కులు దక్కలేదు.

2011లో దక్షిణాఫ్రికా తరఫున బరిలోకి దిగిన తాహిర్​... కేవలం 20 టెస్టుల్లోనే 57 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్రోటీస్​ తరఫున 107 వన్డేల్లో 173 వికెట్లు, 38 టీ20ల్లో 63 వికెట్లు సాధించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్​లో దక్షిణాఫ్రికా కీలక బౌలర్​గా ఎదిగాడు. ఇప్పటికీ అదే జట్టుకు ఆడుతూ సత్తా చాటుతున్నాడు.

ఇమ్రాన్​ తాహిర్​

జోఫ్రా ఆర్చర్​

ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్​ ఒకడు. ఇటీవల ఐపీఎల్​లోనూ ఆల్​రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టేశాడు. లైన్​ అండ్​ లెంగ్త్​తో పాటు పదునైన పేస్​ ఇతడి బలం. ప్రస్తుతం ఇంగ్లాండ్​ తరఫున అదరగొడుతున్న ఈ పేసర్​.. కరీబియన్​ దేశానికి చెందినవాడు. తల్లి వెస్టిండీస్​, తండ్రిది ఇంగ్లాండ్​. కెరీర్​లో ఆరంభంలో అండర్-19 ప్రపంచకప్​లో వెస్టిండీస్​కు ఆడాడు. గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.

అనంతరం 25 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్​ జట్టు తరఫున అరంగేట్రం చేసిన జోఫ్రా.. 11 టెస్టుల్లో 38 వికెట్లు తీశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ దుమ్ములేపాడు​. 17 వన్డేల్లో 30 వికెట్లు పడగొట్టి, 4 టీ20ల్లో 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది ఇంగ్లాండ్​, వన్డే ప్రపంచకప్​ అందుకోవడంలోనూ కీలకంగా వ్యవహరించాడు​. ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్​లో ఆరో స్థానంలో, వన్డే బౌలర్ల జాబితాలో ఐదో ర్యాంక్​లో ఉన్నాడు.

జోఫ్రా ఆర్చర్​

మార్కస్​ లబుషేన్​

మార్కస్​ లబుషేన్​.. కంకషన్​ సబ్​స్టిట్యూట్​గా తొలిసారి బరిలో దిగిన ఆటగాడు. అరంగేట్రంలోనే వరుస శతకాలతో విజృంభించాడు​. తనదైన ఆటతీరు, బ్యాటింగ్​ శైలితో ఎంతోమంది అభిమానులకు ఫేవరెట్​గా మారాడు. అయితే ఆస్ట్రేలియా జట్టులో విశేషంగా రాణిస్తున్న ఇతడు.. పుట్టింది దక్షిణాఫ్రికాలోని క్లెర్క్స్​డ్రాప్​లో. తనకు పదేళ్ల వయసులో 2004లో తన తండ్రితో కలిసి ఆస్ట్రేలియాకు వలస వచ్చేశారు. అనంతరం దేశవాళీల్లోనూ, క్వీన్స్​లాండ్​ తరఫున అదరగొట్టి.. ఆస్ట్రేలియా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2016-17లో దేశవాళ్లీలో 45 సగటుతో పరుగులు చేయడం వల్ల సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఈ టోర్నీలో ప్లేయర్​ ఆఫ్​ ద టోర్నీగా నిలవడం సహా 2018లో పాకిస్థాన్​తో జరిగిన ఓ సిరీస్​కు ఎంపిక చేసింది ఆస్ట్రేలియా యాజమాన్యం. ఆ టోర్నీలో 14 టెస్టుల్లో ఏకంగా 1459 పరుగులు చేశాడు. 10 వన్డేల్లో 394 పరుగులు​ సాధించాడు. బౌలింగ్​తోనూ అలరించిన ఇతడు.. 12 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. స్మిత్​ లాంటి స్టార్​ క్రికెటర్​ స్థానాన్ని భర్తీ చేయగలిగే భరోసా ఇచ్చాడు లబుషేన్​. అందుకే ఆస్ట్రేలియా జట్టులో కీలకంగా మారాడు. త్వరలో భారత్​-ఆస్ట్రేలియా సిరీస్​లోనూ ఆడనున్నాడు.

మార్కస్​ లబుషేన్​

బెన్​ స్టోక్స్​..

బెన్‌ స్టోక్స్‌.. ప్రపంచ ప్రఖ్యాత ఆల్‌రౌండర్‌. ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్‌ కలను సాకారం చేయడమే కాకుండా ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ గెలుచుకోవడంలోనూ కీలకపాత్ర పోషించాడు. గత కొన్నేళ్లుగా ఇంగ్లాండ్‌ ప్రతి విజయంలోనూ స్టోక్స్ ఉంటున్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉంటూ ప్రత్యర్థికి సవాలుగా మారాడు. ఇంత ప్రతిభావంతుడైన స్టోక్స్ మాత్రం పుట్టింది న్యూజిలాండ్​లో. ఇతడి తండ్రి కివీస్​ దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం విశేషం. అయితే స్టోక్స్​లోని క్రికెట్​ ప్రతిభను మాత్రం ఆ దేశం త్వరగా గుర్తించలేకపోయింది. అలా ఇంగ్లాండ్​ తరఫున బరిలోకి దిగి, 2010లో జరిగిన అండర్​-19 ప్రపంచకప్​లో ఆల్​రౌండర్​గా సత్తా చాటాడు. అనంతరం జాతీయ జట్టుకు ఎంపికై 67 టెస్టుల్లో 4400 పరుగులు చేశాడు. వన్డేల్లో 2682 పరుగులు, టీ20ల్లో 305 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు.

బెన్​ స్టోక్స్​

ఇమద్​ వసీం

ఇంగ్లాండ్​లోని స్వన్​సియాలో పుట్టిన ఇమద్​ వసీం.. పాకిస్థాన్​ జట్టుకు ఆడుతున్నాడు. 31 ఏళ్ల ఈ స్పిన్నర్​.. గత కొన్నేళ్లుగా పాక్​ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జూనియర్​ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు పాక్​ జట్టులో ఇతడు మంచి పేరు తెచ్చుకున్నాడు.

2015లో శ్రీలంకతో జరిగిన వన్డేలో అరంగేట్రం చేసిన వసీం.. ఇప్పటివరకు దాదాపు 55 వన్డేల్లో బరిలోకి దిగాడు. 44 వికెట్లు తీశాడు. పొట్టి ఫార్మాట్​లోనూ 48 మ్యాచ్​ల్లో 47 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల పాకిస్థాన్​ సూపర్​ లీగ్​లోనూ ఇతడు ఆడిన కరాచీ కింగ్స్​ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలోనూ అద్భుత ప్రదర్శన చేసిన ఇమద్.. ప్రస్తుతం ఆ దేశ స్పిన్​ విభాగంలో స్టార్​ ప్లేయర్​గా కొనసాగుతున్నాడు.

ఇమద్​ వసీం

ఇయాన్​ మోర్గాన్​

ఐర్లాండ్​ పుట్టిన ఇయాన్​ మోర్గాన్​.. ఇంగ్లాండ్​ జట్టుకు వెన్నెముకలా తయారయ్యాడు. అండర్​-17, 19లో ఐర్లాండ్​ తరఫున ఆడిన ఇతడు.. ఆ దేశ జాతీయ జట్టుకు కెప్టెన్​గానూ రెండేళ్లు పనిచేశాడు. తనలోని ప్రతిభను గుర్తించిన ఇంగ్లాండ్​.. ఓ అవకాశం ఇచ్చింది. ఏకంగా 2019 ప్రపంచకప్​ జట్టుకు సారథ్యం వహించి.. మొట్టమొదటసారి కప్​ను తెచ్చిపెట్టాడు. టైటిల్​ గెలవాలన్న ఎన్నో ఏళ్ల ఇంగ్లాండ్ కలను నిజం చేశాడు.

మిడిలార్డర్​ బ్యాట్స్​మన్​గా బరిలోకి దిగే మోర్గాన్​.. 241 వన్డేల్లో 138.87 సగటుతో 7598 పరుగులు​ చేశాడు. 94 టీ20ల్లో 2240 పరుగులు సాధించాడు.

ఇయాన్​ మోర్గాన్​

క్రిస్​ జోర్డాన్​

వెస్టిండీస్​ బార్బడోస్​లో పుట్టిన జోర్డాన్​.. ప్రస్తుతం ఇంగ్లాండ్​ తరఫున ఆడుతున్నాడు. ఆటల్లో ఇచ్చే స్కాలర్​షిప్​ కోసం డల్​విష్​ కళాశాలలో చేరిన ఇతడు.. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇంగ్లీష్​ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కెరీర్​ ఆరంభంలో సర్రే తరఫున ఐదు కౌంటీ ఛాంపియన్​షిప్స్​లో సత్తా చాటాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో తొలిసారి ఇంగ్లాండ్​ జెర్సీ ధరించాడు. మీడియం పేస్​తో బౌలింగ్​ వేసే జోర్డాన్​.. 34 వన్డేల్లో 45 వికెట్లు తీశాడు. పొట్టి ఫార్మాట్​లోనూ 52 మ్యాచ్​ల్లో 63 వికెట్లు పడగొట్టాడు. 32 ఏళ్ల ఈ క్రికెటర్​.. ప్రస్తుతం ఇంగ్లాండ్​ జట్టు ప్రధాన బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు.

క్రిస్​ జోర్డాన్​

జేసన్​ రాయ్​

క్రిస్​ జోర్డాన్​, జోఫ్రా ఆర్చర్​, ఇయాన్​ మోర్గాన్​, క్రిస్​ జోర్డాన్​ లాంటి ఆటగాళ్లతో పాటు మరొకరికి చోటిచ్చింది ఇంగ్లాండ్​​. ఓపెనింగ్​లో అదరగొట్టే జేసన్​ రాయ్​.. ఆరంభంలో దక్షిణాఫ్రికా తరఫున డర్బన్​లో అరంగేట్రం చేశాడు. అయితే తర్వాతి కాలంలో తనదైన ప్రదర్శనతో ఇంగ్లాండ్​ జట్టులో చోటు సుస్థిరం చేసుకున్నాడు.

30 ఏళ్ల రాయ్​.. 2015లో ఐర్లాండ్​పై అరంగేట్రం చేశాడు. 92 వన్డేల్లో 3483 పరుగులు నమోదు చేశాడు. 36 టీ20​ల్లో 866 పరుగులు చేశాడు.

జేసన్​ రాయ్​

క్రికెట్లో ఒక దేశానికి చెందిన ఆటగాడు.. ఇంకో దేశానికి ఆడొచ్చా?

ఓ దేశ జాతీయ జట్టుకు ఓ ఆటగాడు ఆడాలంటే అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ వ్యక్తి ఆ దేశంలో జన్మించి ఉండాలి. లేదా ఆ దేశ పౌరసత్వం కలిగి ఉండాలి. చివరి నాలుగేళ్లలో ఏడాదికి కనీసం 183 రోజుల చొప్పున ఆ దేశంలో నివసించి ఉండాలి. ఈ మూడు షరతుల్లో దేనికి లోబడి ఉన్నా సరే ఆ ఆటగాడిని ఆ దేశం తరఫున ఆడేందుకు అనుమతిచ్చింది.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనల్ని ఐసీసీ సడలిస్తుంది కూడా. 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాడైన ఎడ్‌ జాయ్స్‌ను ఐర్లాండ్‌ తరఫున ఆడేందుకు ఇలానే అనుమతించింది. అతడికి ఐరిష్‌ మూలాలుండటం వల్ల పై మూడు షరతుల్లో వేటికీ లోబడి లేకున్నా ఐర్లాండ్‌కు ఆడేందుకు జాయ్స్‌ను అనుమతించింది. అయితే ఐసీసీ షరతులతో సంబంధం లేకుండా ఒక విదేశీయుడిని తమ దేశం తరఫున ఆడించే విషయంలో ఏ దేశానికా దేశంలో క్రికెట్‌ బోర్డులు ప్రత్యేకంగా నిబంధనలు పెట్టుకున్నాయి.

భారత్​లో ఇలా..

మన దేశ పౌరసత్వం ఉన్న వాళ్లనే ఏ క్రీడలో అయినా జాతీయ జట్టుకు ఆడేందుకు అనుమతిస్తారు. భారత క్రీడా మంత్రిత్వ శాఖ 2008లో ఈ మేరకు నిబంధన తెచ్చింది. దాన్ని అన్ని క్రీడా సంఘాలూ అనుసరిస్తున్నాయి. బీసీసీఐ కూడా మినహాయింపేమీ కాదు. విదేశీ మూలాలున్నప్పటికీ భారత్‌లో స్థిరపడి ఇక్కడి పౌరసత్వం పొందిన రోజర్‌ బిన్నీ, రాబిన్‌ సింగ్‌ లాంటి వాళ్లు భారత్‌కు ఆడారు. అయితే ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల మాదిరి కొన్నేళ్లు దేశంలో నివసిస్తే.. జాతీయ జట్టుకు ఆడే అర్హత పొందే అవకాశం భారత్‌లో లేదు.

ఇంగ్లాండ్‌ ఇంతకుముందు తమ దేశంలో ఏడేళ్లు నివసించిన ఆటగాడిని జాతీయ జట్టులో ఆడేందుకు అనుమతించేది. అయితే కొన్నేళ్ల కిందట ఆ వ్యవధిని మూడేళ్లకు కుదించింది. ప్రస్తుత ఇంగ్లాండ్‌ జట్టులోని మొయిన్‌ అలీ, అదిల్‌ రషీద్‌.. మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ సహా చాలామందే విదేశీయులు ఇంగ్లాండ్‌కు వచ్చి కొన్నేళ్లు దేశవాళీల్లో ఆడి.. ఆపై జాతీయ జట్టుకు ఎంపికైన వాళ్లే. ఆస్ట్రేలియా జట్టులో ఖవాజా, న్యూజిలాండ్‌ జట్టులోని ల్యూక్‌ రోంచీ కూడా ఈ కోవకు చెందిన వాళ్లే.

ఓ ఆటగాడు రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన ఉదంతాలు ప్రపంచ క్రికెట్లో చాలానే ఉన్నాయి. ఈ జాబితాలో 26 మంది ఆటగాళ్లుండటం విశేషం.

ABOUT THE AUTHOR

...view details