కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైన భారత్- బంగ్లాదేశ్ మధ్య తొలి డే/నైట్ టెస్టు... ఘనంగా ఆరంభమైంది. ఆట వీక్షించేందుకు 40వేలకు పైగా జనంతో మైదానం స్టాండ్లు కిక్కిరిసిపోయాయి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు అభిమానులు అరుపులు, కేరింతలతో ఉత్సాహపరిచారు. మైదానంలో హుషారు చూస్తే టెస్టు కాదు వన్డే, టీ20 జరుగుతున్నట్టుగా వాతావరణం కనిపించింది.
మ్యాచ్ మధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. భోజన విరామంలో సచిన్ తెందూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, హర్భజన్‌సింగ్ నలుగురూ అలనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. హీరో కప్‌లో వెస్టిండీస్‌తో ఫైనల్, 2001లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ విశేషాలను చర్చించారు.
చర్చా కార్యక్రమంలో లక్ష్మణ్, భజ్జీ, కుంబ్లే, సచిన్ ఇవీ విశేషాలు...
- ఈడెన్ గార్డెన్స్ తొలి చారిత్రక డే/నైట్ టెస్టుకు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్ టాస్ కోసం బీసీసీఐ ప్రత్యేకంగా బంగారు నాణెం రూపొందించింది.
- బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ్ బంగ సీఎం మమతా బెనర్జీ ఈడెన్‌లో గంట మోగించి మ్యాచ్‌ను ఆరంభించారు.
- టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్వయంగా తన జట్టు సభ్యులను హసీనా, మమతకు పరిచయం చేశాడు.
- గులాబి టెస్టులో తొలి వికెట్ తీసిన భారతీయుడిగా ఇషాంత్ శర్మ ఘనత సాధించాడు.
- డే/నైట్ టెస్టులో తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించిన భారతీయ బౌలర్‌గా ఇషాంత్ శర్మ (5/22) సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2007 తర్వాత స్వదేశంలో అతడు ఈ ఘనత సృష్టించడం ఇదే తొలిసారి.
- మహ్మద్ షమి వేసిన బౌన్సర్ తగలడంతో బంగ్లా ఆటగాడు లిటన్ దాస్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మరో ఆటగాడు నయీమ్‌కూ షమి బౌన్సర్ తగిలింది. వారి స్థానాల్లో కాంకషన్ సబ్‌స్టిట్యూట్లుగా మెహదీ హసన్, తైజుల్ ఇస్లామ్ వచ్చారు.
- గులాబి టెస్టులో తొలి అర్ధశతకం సాధించిన భారత బ్యాట్స్‌మన్ ఛెతేశ్వర్ పుజారా.
- టెస్టుల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన సారథిగా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు.
- టెస్టుల్లో 100 మందిని ఔట్ చేసిన ఐదో భారత వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహా నిలిచాడు.
తేనీటి విరామంలో బంగాల్ క్రికెట్ సంఘం టీమిండియా మాజీ సారథులను ప్రత్యేకంగా గౌరవించింది. వారిని వాహనాల్లో కూర్చోబెట్టి మైదానంలో ఊరేగించింది. ఈ వాహనాల గ్రాండ్ పరేడ్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, సచిన్ తెందూల్కర్, మహ్మద్ అజహరుద్దీన్, కపిల్‌దేవ్, కృష్ణమాచారి శ్రీకాంత్, మహిళల జట్టు సారథులు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, డయానా ఎదుల్జీ, బీసీసీఐ అధికారులను ఊరేగించారు. వారంతా అభిమానులకు అభివాదం చేశారు. ఈ పరేడ్‌లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కనిపించలేదు.