ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్‌పై ఓడిపోయిన దక్షిణాఫ్రికా గెలుపు కోసం ఆరాటపడుతోంది. 2015 మెగాటోర్నీలో క్వార్టర్స్ వరకు చేరిన బంగ్లాదేశ్ అదే జోరును ఈ సీజన్లోనూ కొనసాగించాలనుకుంటోంది. ఈ రెండు జట్ల మధ్య నేడు లండన్ ఓవల్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచకప్ ఐదో మ్యాచ్ జరగనుంది.
సౌతాఫ్రికా సత్తాచాటుతుందా..
డుప్లెసిస్ సారథ్యంలో ప్రపంచకప్ బరిలో దిగిన ప్రొటీస్ జట్టు ఇంగ్లాండ్‌పై 104 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లీష్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ధాటికి 207 పరుగులకే కుప్పకూలింది. తొలి మ్యాచ్‌లో పరాజయం పొందిన దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్‌పై సత్తాచాటాలని భావిస్తోంది.
లుంగి ఎంగిడి, కగిసో రబాడా, ఇమ్రాన్ తాహిర్‌లతో బౌలింగ్ విభాగం బలంగా ఉంది. గత మ్యాచ్‌లో డికాక్, డస్సెన్ అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. మిగతా వారు పెద్దగా రాణించలేదు. డుప్లెసిస్ 5 పరుగులకే ఔటయ్యాడు. అతడు ఫామ్ లోకి రావాలని ప్రొటీస్ అభిమానులు ఆశిస్తున్నారు. డుమినీ, మర్కరమ్ స్థాయి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది.
ప్రపంచకప్‌లో ఇరుజట్లు ముఖాముఖీ మూడు సార్లు తలపడగా.. రెండు సార్లు ప్రొటీస్ గెలిచింది. ఒక్కసారి బంగ్లాదేశ్ విజయం సాధించింది. 2007 వరల్డ్‌కప్ టోర్నీలో 67 పరుగుల తేడాతో బంగ్లా జట్టు గెలిచింది.