అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు వీవీఎస్ లక్ష్మణ్ క్యాచ్ వదిలేయడం ఓ కారణంగా నిలిచిందని ఆసీస్ మాజీ వికెట్‌కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నాడు. అతడి క్యాచ్‌లు వదిలేయడం మంచిది కాదని గుర్తు చేసుకున్నాడు. లక్ష్మణ్, హర్భజన్‌సింగ్ నిరంతరం ఆస్ట్రేలియాను ఇబ్బంది పెట్టారని పేర్కొన్నాడు. లైవ్ కనెక్టెడ్ టీవీ షోలో అతడు మాట్లాడాడు.
"ఆ క్యాచ్ నేలపాలు చేయడం నా వీడ్కోలుకు ఓ మంచి కారణం. టెస్టు మ్యాచ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ క్యాచ్ విడిచేయడం సరికాదు. అతడికి అన్ని అవకాశాలు ఇవ్వకూడదు" అని గిల్లీ అన్నాడు.
2008లో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. అడిలైడ్‌లో జరిగిన నాలుగో మ్యాచులో ఈ ఘటన చోటు చేసుకుంది. వాస్తవంగా సిరీస్‌కు ముందు గిల్లీ వీడ్కోలుపై వదంతులు వచ్చాయి. వాటిని కొట్టిపారేసి ఆటకు ఇప్పట్లో గుడ్‌బై చెప్పనని అతడు స్పష్టం చేశాడు. కానీ ఆశ్చర్యకరంగా మధ్యలోనే వీడ్కోలు ప్రకటించాడు.