నెలరోజుల్లోనే ఐపీఎల్ సంబరం మొదలుకానుంది. అయితే ఈసారి భారత్‌లో కాకుండా యూఏఈలో ఈ లీగ్ నిర్వహించనున్నారు.సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు పోటీలు జరగనున్నాయి. ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూడలేకపోయినా టీవీ తెరల్లో అభిమానులు మ్యాచ్‌లు వీక్షించనున్నారు. అయితే ఆటగాళ్లు, ఫ్రాంఛైజీలు, టోర్నీ నిర్వహకులు ఎదుర్కొనే సవాళ్లు మాత్రం అత్యంత కఠినంగా ఉండబోతున్నాయి. ఇందులో బయోబబుల్ ఒకటి.
బుడగ గట్టిదేనా?
ఐపీఎల్‌లో బయో బుడగ మరో సవాలే. వెస్టిండీస్, పాకిస్థాన్‌తో సిరీసులకు ఇంగ్లాండ్ ఇదే ప్రయోగం చేసి విజయవంతమైంది. అయితే అక్కడ కేవలం రెండు జట్లు మాత్రమే సురక్షిత వాతావరణంలో ఉన్నాయి. మొత్తంగా 50 మందికి మించి ఉండరు. కానీ ఐపీఎల్‌లో మాత్రం అత్యంత కష్టం.
ఒక్కో జట్టులో కనీసం 20 మందికి పైగా ఆటగాళ్లు ఉంటారు. కోచింగ్, ఫ్రాంఛైజీ సిబ్బంది అదనం. ఒక్కో ఫ్రాంఛైజీ నుంచి అందరూ కలిపి 35 మంది ఉన్నా ఎనిమిది ఫ్రాంఛైజీలకు 280 మంది అవుతారు. వీరే కాకుండా ఐపీఎల్ నిర్వహక కమిటీ సభ్యులు, అధికారులు, సాంకేతిక, అంపైరింగ్, లాజిస్టిక్స్, ప్రసారదారు, రవాణా సిబ్బందీ ఉంటారు. అంటే ఈ లీగ్‌లో మొత్తంగా 350-400 మంది ఉండే అవకాశం ఉంది. అంత మందితో బయో బబుల్ విజయవంతమైతే చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఆటగాళ్లలో ఏ ఒక్కరికైనా కొవిడ్-19 సోకితే ఏం చేస్తారో ఇంకా నిర్ణయించలేదు! క్వారంటైన్, చికిత్స, ప్రైమరీ కాంటాక్టుల పరంగా ఏం చేస్తారో తెలియదు.