ఐపీఎల్ 13వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. మరో నెల రోజుల్లోనే ఈ క్రీడాపండుగ ప్రారంభం కానుంది. భారత్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది టోర్నీని యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నారు. తొలిసారి 'డ్రీమ్ 11' స్పాన్సర్‌గా నిలిచింది. అయితే ఈ పోటీలకు మూడు స్టేడియాలు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది ఆర్సీబీ ఫ్రాంఛైజీ. ఓసారి వాటిని చూడండి..
దుబాయ్...
ఈ మైదానంలోని పిచ్ పేసర్లకు బాగా అనుకూలిస్తుంది. ఫాస్ట్ బౌలింగ్ బలంగా ఉన్న జట్లు బాగా రాణిస్తాయి. ఈ స్టేడియం మిగతా వాటితో పోలిస్తే పెద్దది.
సగటు స్కోరు: 149
సగటు ఎకానమీ: 7.50
షార్జా...
ఈ వికెట్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తుంది. అంతేకాదు బౌలింగ్‌లో స్పిన్నర్లకూ సహకరిస్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 26 సార్లు గెలవగా.. ఛేజింగ్ జట్టు 36 విజయాలు సాధించింది.
అబుదాబి..
స్పిన్నర్లకు ఇది స్వర్గధామం. బౌండరీలు చాలా దూరంగా ఉంటాయి. ఈ మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 8 సార్లు గెలవగా.. ఛేజింగ్ జట్టు 11 సార్లు నెగ్గింది.
అంతా భిన్నం
గతంలో పోలిస్తే ఈ ఐపీఎల్ భిన్నంగా ఉండనుంది. మైదానాల్లో అల్లరి చేస్తూ ఈలలు వేస్తూ ఎగిరి గంతులు వేసేందుకు అభిమానులు ఉండరు! ఆటగాళ్లు ఒకరినొకరు ముట్టుకొనేందుకు అవకాశం లేదు. బంతిపై ఉమ్మి రాయకుండానే స్వింగ్ చేయాలి. ప్రత్యర్థి ఔటైనా సరే జబ్బలు చరుచుకుంటూ ఒకరినొకరు కౌగిలించుకొంటూ ఆనందాన్ని పంచుకొనే పద్ధతి లేదు.
గెలిచినా.. ఓడినా అవతలి జట్టు సభ్యులతో కరచాలనం చేయకూడదు. క్రికెటర్ల సతీమణులు, పిల్లల సందడి గ్యాలరీల్లో కనిపించదు. మీడియాతో మాట్లాడొద్దు. ఒకవేళ మాట్లాడినా భౌతికదూరం తప్పదు. మ్యాచ్‌లు ముగిశాక ఆటగాళ్లు హోటల్ గదుల్లో ఏకాంతంలోకి వెళ్లిపోవాలి. ఎవరినీ కలవొద్దు. కఠిన నిబంధనలు పాటించాలి. దానికి తోడు ప్రతి ఐదు రోజులకు కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలి. 400 మందితో ఏర్పాటయ్యే ఈ బయో బుడగ ఎంత పటిష్ఠంగా ఉంటుందో చూడాలి.
53 రోజుల పండగ
సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్-2020 జరుగుతుంది. మొత్తం 53 రోజుల టోర్నీ. 10 డబుల్ హెడర్స్ (రోజుకు రెండు మ్యాచులు). గతానికి భిన్నంగా మ్యాచులు అరగంట ముందే ఆరంభం అవుతాయి. రాత్రివేళ మ్యాచ్ 7:30 గంటలకు, సాయంత్రం మ్యాచ్ 3:30 గంటలకు మొదలవుతాయి. సాధారణంగా ఏటా జరిగే ఐపీఎల్ సమయంలో ఉగాది పండగను జరుపుకొంటాం. ఈసారి కీలకమైన దసరా, దీపావళి జరుపుకోనున్నాం. సినిమా థియేటర్లు తెరవడంపై స్పష్టత లేదు కాబట్టి బహుశా పండుగ దినాల్లో ఇక క్రికెట్టుతోనే ఎంటర్‌టైన్‌మెంట్!
గతంలోనూ యూఏఈలో..
తొలుత మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో భారత్‌లో ఆ టోర్నీని నిర్వహించడం సాధ్యం కాదని భావించిన బీసీసీఐ.. యూఏఈలో టోర్నీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఐసీసీ కూడా టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేయడం వల్ల ఐపీఎల్‌కు మార్గం సుగుమం అయింది.
ఇక 2014లో సగం టోర్నీని యూఏఈలోనే నిర్వహించిన నేపథ్యంలో.. ఈసారి కూడా అక్కడే నిర్వహించేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, ఈ టోర్నీ నిర్వహణకు శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఆసక్తి చూపించింది.