భారత క్రికెట్ మాజీ సారథి, ప్రస్తుత జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్.. తనపై వస్తున్న విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలపై స్పందించాడు. బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ ముందు గురువారం హాజరై వివరణ ఇచ్చాడు.
ఎన్సీఏ డైరక్టర్‌గానే కాకుండా ఇండియా సిమెంట్స్‌లో ఉపాధ్యక్షుడిగానూ కొనసాగుతున్నాడు ద్రవిడ్. అయితే మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ జీవితకాల మెంబర్ సంజీవ్ గుప్తా.. ఈ క్రికెటర్ విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడని బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై ఇప్పటికే స్పందించిన ద్రవిడ్.. ప్రస్తుతం ఇండియా సిమెంట్స్ పదవి నుంచి సెలవు తీసుకున్నానని వివరణ ఇచ్చాడు. ఇతడే కాకుండా బీసీసీఐకి చెందిన మరో ఉద్యోగి మయాంక్ పరిఖ్, ఎథిక్స్ ఆఫీసర్ ముందు గురువారం హాజరయ్యాడు.