రాహుల్ ద్రవిడ్.. ఒకప్పుడు టీమ్‌ఇండియా గోడ. ఇప్పుడు జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్. ఈ మధ్యలో భారత యువ జట్టుకు కోచ్‌గా మరో ముఖ్యమైన పాత్రను పోషించాడు. మెరికల్లాంటి కుర్రాళ్లను తయారు చేసి మంచి కోచ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ద్రవిడ్ గొప్ప కోచ్ అన్నది కాదనలేని నిజం. కాని అతడిలోని కోచ్ లక్షణాలు 2007లోనే బయటపడ్డాయి. నైరాశ్యంలో కూరుకుపోయిన భారత జట్టులో స్ఫూర్తి రగిలించి.. అద్భుతం సృష్టించిన ఘనత అతడి సొంతం.
కెప్టెన్, కోచ్‌గా ద్విపాత్రాభినయం చేసి టీమ్‌ఇండియాకు చిరస్మరణీయ సిరీస్ విజయాన్ని అందించాడు. సీనియర్లు సచిన్ తెందుల్కర్, సౌరభ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్.. జూనియర్లు ధోని, దినేశ్ కార్తీక్, శ్రీకాంత్, ఆర్పీ సింగ్‌లను ఒక్కతాటిపైకి తెచ్చి ఫలితాన్ని రాబట్టాడు. మూడు టెస్టుల పటౌడీ ట్రోఫీ 1-0తో భారత్ సొంతమైంది. మొదటి, మూడో టెస్టులు డ్రా కాగా.. రెండో టెస్టులో ద్రవిడ్ సేన నెగ్గింది. ప్రతికూల పరిస్థితులు.. పేస్, స్వింగ్ సహకరించే పిచ్‌లపై భారత ఆటగాళ్లు సమష్టిగా చెలరేగారు. ద్రవిడ్ ఇచ్చిన స్ఫూర్తితో లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే సైతం సెంచరీ చేయడం విశేషం. ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా తరఫున నమోదైన ఏకైక సెంచరీ అదే కావడం మరో విశేషం. జహీర్‌ఖాన్ (18) అత్యధిక వికెట్లతో 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు అందుకోగా.. భారత్ తరఫున దినేశ్ కార్తీక్ (263) పరుగుల వీరుడిగా నిలిచాడు. ఆ తర్వాత భారత్ ఇప్పటివరకు ఇంగ్లాండ్ గడ్డ మీద టెస్టు సిరీస్ గెలవలేదు.
నిలిచి గెలిచిన ధోని
ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో తొలి టెస్టు. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో బౌలర్లు వికెట్ల పండుగ చేసుకోగా.. వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. హేమాహేమీలు చేతులెత్తేయగా.. ఆఖరి బంతి వరకు క్రీజులో నిలిచి మ్యాచ్‌ను కాపాడాడు. 48.4 ఓవర్లు క్రీజులో నిలిచి టీమ్‌ఇండియాకు ఓటమికి మధ్య అడ్డు గోడలా నిలిచాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 298 పరుగులకు ఆలౌటవగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 282 పరుగులు సాధించిన ఇంగ్లాండ్.. 380 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓటమి ఖాయమనుకున్న టీమ్‌ఇండియాకు మొదట ధోని.. తర్వాత వరుణుడు అండగా నిలిచారు.
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 41 ఓవర్లలో 3 వికెట్లకు 137 పరుగులు చేసింది. వసీం జాఫర్, ద్రవిడ్, సచిన్ ఔటయ్యారు. చివరి రోజు కనీసం 90 ఓవర్ల ఆట. విజయానికి మరో 243 పరుగుల దూరం. గెలుపుపై ఆశల్లేవ్! డ్రాతో గట్టెక్కితే చాలనుకునే పరిస్థితి! ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కార్తీక్ (60), గంగూలీ (40) అరగంటలోపే పెవిలియన్ చేరడం వల్ల టీమ్‌ఇండియా పనైపోయినట్లుగా అనిపించింది. ఆ దశలో వీవీఎస్ లక్ష్మణ్ (39), ధోని (76 నాటౌట్) జట్టును ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 28.4 ఓవర్లు ఎదుర్కొని 86 పరుగులు జోడించారు. కానీ లక్ష్మణ్ ఔటవడం వల్ల భారత జట్టు డ్రా ఆశలు సన్నగిల్లాయి. కానీ టెయిలెండర్లతో కలిసి ధోని 20 ఓవర్ల పాటు పోరాడాడు.