తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెప్టెన్ హాట్ విరాట్​ కోహ్లికి.. ఈ పుట్టిన రోజు డబుల్ ధమాకా! - virat kohli and Anushka sharma

విరాట్‌కోహ్లి... ఉప్పొంగే లావాలా, దూసుకొచ్చే బాణంలా కనిపిస్తాడు. భారత్‌లోనే కాదు, ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే అతడో సంచలనం. గత దశాబ్దకాలంగా తన ఆటతీరూ ప్రవర్తనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న కోహ్లి జన్మదినం నవంబరు 5న. ఈ పుట్టినరోజు తనకు డబుల్‌ ధమాకా, ఎందుకంటే తండ్రి కాబోతున్నాడు కదా! మరి ఈ సందర్భంలో తనను ఇంత ప్రత్యేకంగా నిలబెట్టిన అంశాలూ, అతడికి మాత్రమే సాధ్యమైన ఘనతలేంటో చూద్దామా!

Virat kohli  his birth day
విరాట్ కోహ్లి బర్త్ డే

By

Published : Nov 1, 2020, 9:20 AM IST

నాన్నకు ప్రేమతో..

బహుశా ఇండియన్‌ కెప్టెన్లలో విరాట్‌కున్న దూకుడు మరొకరిలో చూడలేమేమో! అదే సమయంలో అవసరమైనప్పుడు అంతే సంయమనం పాటిస్తాడు. 18 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు విరాట్‌. ఆ బాధలోనూ కర్ణాటక మీద రంజీ ట్రోఫీలో ఆడి 90 రన్స్‌ చేసి జట్టుకు అండగా నిలబడ్డాడు. అప్పుడు నాన్న కోసం తను పడ్డ బాధ చూసి అసలు ఆడగలడని కూడా ఎవ్వరూ అనుకోలేదట! లోలోపల దాగిన ఆవేదనని తన బ్యాటు ద్వారా చూపబట్టే ఆ ప్రదర్శన సాధ్యమైంది. ఆ తర్వాతా దానికే అలవాటుపడ్డాడు. తన జెర్సీ మీద 18 సంఖ్య ఉండటానికి కారణం వాళ్ల నాన్న ఆ తేదీన చనిపోవడమే.

కెప్టెన్‌ హాట్‌..

కుర్ర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించడంలో తన తర్వాతే ఎవరైనా. కెప్టెన్‌గా ఎన్నో అరుదైన ఫీట్లు సాధించాడు. ఒకే సంవత్సరంలో ఆరు వన్డే సెంచరీలు చేసిన కెప్టెన్‌ ఇతడే. ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌, సౌత్‌ ఆఫ్రికాలో వన్డే సిరీస్‌ గెలిచిన ఇండియన్‌ కెప్టెన్‌ విరాట్‌ తప్ప మరొకరు లేరు. భారత క్రికెట్‌ జట్టు సారథుల్లో అత్యంత విజయవంతమైనది విరాట్‌ మాత్రమే. తన సక్సెస్‌ రేట్‌ 71.83.

ఎన్నో రికార్డులు

వన్డే ఫార్మాట్‌లో తనకంటే ముందున్న ఎన్నో రికార్డులను కోహ్లి బద్దలుగొట్టాడు. ఈ ర్యాంకింగ్‌లో 890 రేటింగ్‌ సాధించిన భారత ఆటగాడు కోహ్లి మాత్రమే. అంతకుముందు ఈ రికార్డు సచిన్‌ పేరిట ఉండేది. అతడి పాయింట్లు 887. అలాగే 10,000 రన్స్‌ అత్యంత వేగంగా పూర్తి చేసింది కూడా విరాటే. ఇందుకు కేవలం 205 ఇన్నింగ్స్‌ మాత్రమే తీసుకున్నాడు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఎక్కువ సెంచరీలు(26) చేసిన రికార్డూ తన పేరిటే ఉంది. 2010 నుంచి 2019 వరకూ కోహ్లి అన్ని ఫార్మాట్లలోనూ కలిపి చేసిన రన్స్‌ 20552. ఒక దశాబ్ద కాలంలో 20వేలకు పైగా రన్స్‌ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌ అతడే.

బ్రాండ్‌ బాబు

బ్రాండ్‌ వాల్యూ విషయానికొస్తే బాలీవుడ్‌ స్టార్లూ, ఇతర క్రికెటర్లూ కోహ్లి దరిదాపుల్లోకి కూడా రాలేరు. ప్రస్తుతం 237.5 మిలియన్‌ డాలర్ల (1,746 కోట్ల రూపాయలు) బ్రాండ్‌ వాల్యూతో తొలిస్థానంలో ఉన్నాడు. ప్యూమా, ఆడి, ఎంఆర్‌ఎఫ్‌ టైర్స్‌, ఊబర్‌ ఇండియా, హిమాలయ, కోల్గేట్‌, అడిడాస్‌ వంటి దేశ విదేశీ బ్రాండ్లకు అంబాసిడర్‌ విరాటే. తన యాడ్ల రూపకల్పన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు కోహ్లి. అవి రిలీజ్‌ అయ్యే ముందు కచ్చితంగా ప్రివ్యూ నచ్చితేనే ఓకే చేస్తాడు. తన లుక్‌ విషయంలో ఏమాత్రం రాజీ పడడు.

ఫిట్‌నెస్‌ గురూ

మొత్తం ఆటగాళ్లలో అత్యధికంగా ఫిట్‌నెస్‌ పాటించేది విరాట్‌ మాత్రమే. ఎంతగా అంటే గత రెండుమూడేళ్లలో ఒక్కరోజు కూడా చీట్‌ డే (డైట్‌ను పక్కన పెట్టి నచినవన్నీ లాగించడం) తీసుకోలేదట! తన ఫొటోషూట్స్‌ చూస్తేనే తెలుస్తుంది ఆ విషయం. కఠినమైన వ్యాయామాలు చేస్తూ భోజనం లెక్కగా తీసుకుంటాడు. లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఒక్కరోజూ జిమ్‌ మానలేదు. అంతేకాదు, సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌లోనూ విరాట్‌కు తిరుగులేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఎనిమిది కోట్ల మందికిపైగా ఫాలో అవుతున్నారు. ఈ ఫ్లాట్‌ఫాంలో ఇండియాలో ఇదే అత్యధికం. తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ షేర్‌ చేసుకుంటూ అభిమానులను అలరిస్తుంటాడు. ఇన్ని ప్రత్యేకతలుండబట్టే తను అంత స్పెషల్‌!

ABOUT THE AUTHOR

...view details