హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అవినీతిలో కూరుకుపోయిందని తాను చేసిన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోవద్దని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ను సీనియర్ ఆటగాడు అంబటి రాయుడు కోరాడు. హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతిపై దృష్టి పెట్టి దాన్ని నిర్మూలించాలని కేటీఆర్‌ను కోరినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు రాయుడు.
డబ్బుతో పాటు ఎన్నో ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న అవినీతి పరుల ప్రభావం పడ్డ జట్టుతో హైదరాబాద్ క్రికెట్ గొప్పగా ఎలా ఎదుగుతుందని ఇంతకుముందు ప్రశ్నించాడు రాయుడు. ఈ ట్వీట్‌పై హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ స్పందిస్తూ, రాయుడు "అసహన క్రికెటర్" అని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై రాయుడు ఆదివారం స్పందించాడు.
"హాయ్ అజహరుద్దీన్. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఇది మనిద్దరి కన్నా పెద్దది. హెచ్‌సీఏలో ఏం జరుగుతుందో మనిద్దరికీ తెలుసు. కుట్రలకు దూరంగా ఉంటూ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని బలంగా నమ్ముతున్నా. హైదరాబాద్ క్రికెట్‌ను ప్రక్షాళన చేసే అవకాశం మీకుంది. భవిష్యత్ క్రికెటర్లను కాపాడతారని ఆశిస్తున్నా."
-అంబటి రాయుడు, సీనియర్ ఆటగాడు