అంతర్జాతీయ సిరీస్‌లు లేకపోవడం.. దేశవాళీ టోర్నీలపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఎందుకు సాధన చేస్తున్నామో తమకే తెలియదని టీమ్ఇండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. కరోనా మహమ్మారి మహిళల క్రికెట్‌పై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పింది.
"భవిష్యత్తులో ఏం జరుగుతుంది? టోర్నీల సంగతేంటి? అన్న ఆత్రుత అందరిలోనూ ఉంది. ప్రస్తుతం ఎందుకు సాధన చేస్తున్నామో మాకే తెలియదు. దేనికైనా ఒక ఉద్దేశం ఉండాలి. ఇంతకుముందు విదేశాల్లో లేదా సొంతగడ్డపై అంతర్జాతీయ సిరీస్‌లు ఉన్నప్పుడు అందుకు తగ్గట్లు సన్నద్ధమయ్యేవాళ్లం. ఇప్పుడు మేం ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నామో తెలియదు. అంతర్జాతీయ క్రికెట్ లేదా దేశవాళీ టోర్నీలు లేనప్పుడు సాధన చేసి ఏం లాభమని అప్పుడప్పుడు అనిపిస్తుంది"