దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఫకర్ జమాన్(193) వివాదాస్పద రనౌట్ విషయంలో క్వింటన్ డికాక్ మోసం చేశాడని తాను అననని.. కానీ అతడలా చేయాల్సింది కాదని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. తొలుత ఈ విషయంపై మ్యాచ్ అనంతరం ట్వీట్ చేసిన అక్తర్.. జమాన్ అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు. అలాగే అతడు ద్విశతకానికి అర్హుడని కొనియాడాడు. అయితే.. డికాక్ క్రికెట్ స్ఫూర్తిని మరిచి జమాన్ ఔటయ్యేలా చేశాడని మండిపడ్డాడు.
స్ఫూర్తికి లోబడి లేదు..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన అక్తర్.. 'డికాక్ చేసిందాన్ని నేను మోసం అని పిలవను. కానీ అది క్రీడాస్ఫూర్తికి లోబడి లేదు. ఈ రనౌట్ విషయంలో అదే నాకు నచ్చలేదు. డికాక్ చాలా గొప్ప ఆటగాడు. అతడు కచ్చితంగా ఇలా చేయాల్సింది కాదు. జమాన్ రెండో పరుగు కోసం పరుగెత్తినప్పుడు ఫీల్డర్ బంతిని నాన్‌స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరి ఉంటాడని అనుకున్నాడు. అప్పుడే డికాక్ కూడా చేయిపైకెత్తిన సైగలు చేశాడు' అని అన్నాడు.