టీమ్ఇండియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన క్వీన్స్‌ల్యాండ్ ఆరోగ్య మంత్రి రాస్ బేట్స్ వ్యాఖ్యల పట్ల బీసీసీఐ ఆగ్రహంగా ఉందని సమాచారం. భారత జట్టు నిబంధనలను పాటించదనే తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని బోర్డు భావిస్తోంది. ఆమె వ్యాఖ్యలపై అసంతృప్తిగా ఉన్న బీసీసీఐ సిరీసును మూడు టెస్టులకే పరిమితం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. సిడ్నీలో టెస్టు ముగియగానే మిగిలిన సిరీసును రద్దు చేసుకోవడంపై బీసీసీఐ సమాలోచనలు జరుపుతోందని సమాచారం.
క్వీన్స్‌లాండ్‌లో ఉన్న కఠిన వైరస్ నిబంధనలు పాటించకపోతే భారత జట్టు అక్కడికి రాకూడదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాస్ బేట్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో నాలుగో టెస్టు ఆడేందుకు రానున్న భారత జట్టు కోసం క్వారంటైన్ నిబంధనలను సులభతరం చేసే అవకాశముందా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆమె.. "ఒకవేళ భారత జట్టు ఆ నిబంధనలను పాటిస్తూ క్రికెట్ ఆడలేకపోతే.. ఇక్కడికి రావొద్దు" అని పేర్కొంది. "ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘించేందుకు అవకాశం లేదు. అవివి పాటించాలనుకుంటేనే భారత జట్టు ఇక్కడికి రావాలి" అని ఆ రాష్ట్ర క్రీడామంత్రి టిమ్ మాండర్ కూడా స్పష్టం చేశాడు.