అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఇషాన్ కిషన్ (56) అరంగేట్రం మ్యాచ్‌లోనే దంచికొట్టి.. అందరి చేతా శెభాష్ అనిపించుకున్నాడు. తనదైన షాట్లతో అలరించిన అతడు తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే అర్ధశతకంతో మెరిశాడు. ఆదిలోనే రాహుల్ (0) పెవిలియన్ చేరినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (73*)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. దూకుడుగా ఆడి ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలోనే రెండో వికెట్‌కు కీలకమైన 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం ఇషాన్ ఔటైనా కోహ్లీ టీమ్‌ఇండియాను విజయతీరాలకు చేర్చాడు.
బ్యాటింగ్‌లో ఇషాన్ రూటే సెపరేటు: దినేశ్ కార్తిక్ - ఇషాన్ కిషన్
యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్‌పై టీమ్ఇండియా క్రికెటర్ దినేశ్ కార్తిక్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నాడని అన్నాడు. ఇతర క్రికెటర్లకు ఇషాన్ కిషన్‌కు ఆటతీరులో చాలా వ్యత్యాసం ఉందని ఈ సందర్భంగా తెలియజేశాడు.
ఈ నేపథ్యంలో ఇషాన్ బ్యాటింగ్‌పై స్పందించిన దినేశ్ కార్తీక్ సోమవారం ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశాడు. "నిన్న జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కొన్ని అత్యద్భుతమైన షాట్లు ఆడాడు. అతడు ఇన్నింగ్స్ ప్రారంభించిన విధానం.. ఆత్మవిశ్వాసం.. ఎలాంటి బంతులనైనా అలవోకగా సిక్సర్లుగా మలిచే అతడి సామర్థ్యంపై ఉన్న నమ్మకం.. లాంటి విషయాలు ఇతరులతో అతడిని వేరు చేస్తాయి. పవర్ హిట్టర్ అంటే ఇలాగే ఉండాలి. టాప్ ఆర్డర్‌లో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తెచ్చే బ్యాట్స్‌మన్ కావాలి. జోఫ్రా ఆర్చర్‌పై తొలి బంతి నుంచే ఇషాన్ ఒత్తిడి తెచ్చాడనుకుంటా. అదో శుభపరిణామం" అని దినేశ్ కార్తిక్ తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.