ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను బ్రిస్బేన్ టెస్టులో టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సరదాగా టీజ్ చేశాడు. నాలుగో రోజు ఆటలో స్మిత్ బ్యాటింగ్ చేస్తుండగా.. స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన రోహిత్ ఓవర్ మధ్యలో క్రీజులోకి వెళ్లి తాను బ్యాటింగ్ చేస్తున్నట్లు పోజిచ్చాడు. దాంతో.. ఆసీస్ బ్యాట్స్‌మన్ గుర్రుగా హిట్‌మ్యాన్ వైపు చూస్తూ కనిపించాడు. ఇటీవల సిడ్నీ వేదికగా ముగిసిన మూడో టెస్టులో స్మిత్ కూడా స్లిప్‌లోకి ఫీల్డింగ్ కోసం వెళ్లే ముందు క్రీజులోకి వచ్చి.. రిషబ్ పంత్ గీసుకున్న గార్డ్ మార్క్‌ను చెరిపేయడం వివాదాస్పదమైంది.
స్మిత్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. పంత్ గార్డ్ మార్క్‌ను చెరిపేయడం ద్వారా అతడి బ్యాటింగ్ లయను దెబ్బతీసేందుకు స్మిత్ కుట్ర పన్నాడని నెటిజన్లు మండిపడ్డారు. ఈ క్రమంలోనే స్మిత్‌ను టీజ్ చేసేందుకు బ్రిస్బేన్ టెస్టులో రోహిత్ శర్మ కూడా అలా క్రీజులోకి వెళ్లి పై విధంగా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.