అతను..
సునీల్ గావస్కర్‌లా రోజులకు రోజులు నిలబడే 'మాస్టర్ బ్యాట్స్‌మన్' కాదు!
కపిల్ దేవ్‌లా భారత పేస్ బౌలింగ్ రాతను మార్చిన 'సూపర్ ఫాస్ట్‌బౌలర్' కాదు!
సచిన్ తెందుల్కర్‌లా బ్యాటింగ్‌కు పర్యాయం పదంలా మారిన 'క్రికెట్ దేవుడు' కాదు!
సౌరభ్ గంగూలీలా సై అంటే సై అంటూ ఢీకొట్టే 'దూకుడైన కెప్టెన్' కాదు!
రాహుల్ ద్రవిడ్‌లా క్రీజు చుట్టూ గోడ కట్టే 'బ్యాటింగ్ వాల్' కాదు!
అతను అతనే.. మహేంద్రసింగ్ ధోని!
ఒకరితో పోల్చలేం.. మరొకరితో పూడ్చలేం..!
అతడి పేరు.. మహేంద్ర సింగ్ ధోని!
అతను వేరు.. అంతే!
ఫోర్త్ అంపైర్
భారత క్రికెట్ దిగ్గజం గావస్కర్ కెరీర్లో ఎన్నో అద్భుత ప్రదర్శనలున్నాయి. గొప్ప విజయాలున్నాయి. ఆయన తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు కూడా. మరి సన్నీ తాను చివరి శ్వాస తీసుకునే ముందు చూడాలనుకున్నదేంటో తెలుసా? 2011 వన్డే ప్రపంచకప్‌లో ధోని సిక్సర్ బాది భారత్‌కు మరో ప్రపంచకప్ అందించిన ఉద్వేగభరిత దృశ్యం! ఆ రోజు ధోని బ్యాటింగ్ చేసింది అయిదో స్థానంలో. కానీ ఆ స్థానం అతడిది కాదు. కానీ జట్టు విపత్కర పరిస్థితుల్లో ఉండగా.. ఫామ్‌లో ఉన్న యువరాజ్‌ను ఆపి అతను ముందుకొచ్చాడు. ఆ నిర్ణయం తిరగబడితే తానో చరిత్ర హీనుడవుతానని తెలిసీ ముందడుగు వేశాడు. అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. చరిత్రాత్మక విజయాన్నందించాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా అతను ఆ రోజు చేసిన సాహసం నభూతో నభవిష్యత్! అందుకే అతను వేరు.. అంతే!
ధోని జీవితమేమీ పూల పాన్పు కాదు. అతడి క్రికెట్ ప్రయాణం అంత తేలిగ్గా ఏమీ సాగలేదు. ఘనమైన క్రికెట్ వారసత్వం ఉన్న ముంబయి లాంటి మహా నగరం నుంచి రాలేదతను. పెద్దగా క్రికెట్ సంస్కృతి లేని 'రాంచి' అనే చిన్న నగరం అతడి స్వస్థలం. మధ్యతరగతి కుటుంబం. ఫ్యామిలీ కోసం ఉద్యోగం చేయాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఇంకొకరైతే ఈ స్థితిలో క్రికెట్ ప్రయాణాన్ని ఆపేసేవాళ్లే. కానీ అతను ఆగిపోలేదు. టీమ్‌ఇండియాకు ఆడాలన్న కలను నెరవేర్చుకున్నాడు. అందిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకున్నాడు. ఒకసారి టీమ్‌ఇండియాకు ఆడితే చాలు అనుకున్నవాడు కాస్తా.. ఇప్పుడు భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మెన్, అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిష్క్రమిస్తున్నాడు. అందుకే అతను వేరు!
కెప్టెన్‌గా తొలి అడుగులోనే అద్భుతాలు
బ్యాట్స్‌మన్‌గా జట్టులో స్థానం సుస్థిరమై ఉండొచ్చు. 2007 వన్డే ప్రపంచకప్‌లో ఘోర పరాభవంతో టీమ్‌ఇండియాలో సంక్షోభం నెలకొన్న దశ అది. అప్పటికి మహి అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చి మూడేళ్లు కూడా కాలేదు. జట్టులో తనకంటే సీనియర్లు, మేటి ఆటగాళ్లు ఉన్నారు. ఆ స్థితిలో జట్టు పగ్గాలప్పగించి పొట్టి ప్రపంచకప్‌కు వెళ్లమంటే.. దిగ్గజాలకే భారంగా మారిన నాయకత్వం నాకెందుకని ధోని పక్కకు తప్పుకోలేదు. ధైర్యంగా ముందుకు నడిచాడు. తొలి అడుగులోనే కెప్టెన్‌గా అద్భుతాలు చేశాడు. జట్టును ప్రపంచకప్ విజేతగా నిలబెట్టాడు. దిగ్గజాల్ని గౌరవించాడు. సమకాలీనుల సహకారం తీసుకున్నాడు. జూనియర్లకు మార్గనిర్దేశం చేశాడు. అందరితో సమన్వయం చేసుకుని, సమష్టిగా జట్టును నడిపించి.. వన్డేల్లో అత్యున్నతమైన ప్రపంచకప్‌ను సాధించి పెట్టాడు. టెస్టుల్లోనూ జట్టును అత్యున్నత స్థానంలో నిలబెట్టాడు. అందుకే అతను వేరు!
టాప్ ఆర్డర్లో ఆడే సత్తా ఉన్నా..
"సచిన్ ఔటైతే టీవీలు కట్టేసేవాళ్లం".. అని 90ల నాటి రోజుల గురించి క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అప్పటి మిడిలార్డర్ అంత బలహీనం మరి! మంచి స్థితి నుంచి ఒక్కసారిగా కుప్పకూలడం, స్వల్ప లక్ష్యాల్ని ఛేదించలేక చేతులెత్తేయడం.. లాంటి అనుభవాలు కోకొల్లలు! గంగూలీ కెప్టెన్ అయ్యాక పరిస్థితి మెరుగుపడ్డప్పటికీ.. ధోని వచ్చాక మార్పు వేరు! టాప్‌ఆర్డర్‌లో ఆడే సత్తా, అవకాశం ఉన్నా.. తనను తాను కిందికి దించుకుని మిడిలార్డర్‌కు తిరుగులేని బలం తీసుకొచ్చి, మ్యాచ్‌లు ముగించడంలో తిరుగులేని నైపుణ్యంతో ప్రపంచంలోనే అత్యుత్తమ 'ఫినిషర్'గా పేరు తెచ్చుకున్న ఆటగాడు ధోని. మ్యాచ్ పూర్తిగా చేజారినట్లే కనిపించినా.. "ధోని ఉన్నాడు. చివరిదాకా చూద్దాం" అని టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ఘనత మహీదే. అందుకే అతను వేరు!
వికెట్‌కీపర్‌గా ధోనీ లేకపోవడం వల్లే
కుల్‌దీప్ యాదవ్ మూడేళ్ల కిందట టీమ్‌ఇండియాలోకి వచ్చినప్పటి నుంచి రెండేళ్ల పాటు నిలకడగా రాణించిన స్పిన్నర్. అయితే ఏడాదిగా అతడి ప్రదర్శన బాగా లేదు. జట్టులో చోటు కూడా కోల్పోయాడు. ఉన్నట్లుండి కుల్‌దీప్ ప్రదర్శన పడిపోవడానికి కారణంగా విశ్లేషకులు తేల్చిన విషయమేంటో తెలుసా.. అతను బౌలింగ్ చేస్తుంటే వికెట్ల వెనుక ధోని లేకపోవడం! బ్యాట్స్‌మెన్ కదలికల్ని పరిశీలిస్తూ, ఫీల్డింగ్ మార్పులు చేస్తూ, వ్యూహాత్మక సలహాలిస్తూ, లయ తప్పితే తిడుతూ.. బౌలర్లను మహి నడిపించే తీరే వేరు. గతేడాది ప్రపంచకప్ తర్వాత ధోని భారత్‌కు ఆడకపోవడం వల్ల తాను ఇబ్బంది పడుతున్నట్లు కుల్‌దీప్ స్వయంగా అంగీకరించాడు. యువ ఆటగాళ్లపై ధోని ప్రభావం ఎలాంటిదో చెప్పడానికిది ఉదాహరణ. అందుకే అతను వేరు!
ధోనీ ఉన్నాడన్న ఒక్క ధైర్యంతో..
ధోని ఆకర్షణ కేవలం అతడి ఆటలో లేదు. అంతకుమించి, తన 'ఉనికి'లో ఉంది. బ్యాటింగ్‌లో తేలిపోయినా.. కెప్టెన్సీలో విఫలమైనా.. వికెట్ కీపింగ్‌లో తడబడినా.. అవతలి క్రీజులో ధోని ఉన్నాడన్న ధైర్యంతో ఓ యువ బ్యాట్స్‌మన్ ధైర్యంగా ఆడిన ఓ షాట్‌తో.. ధోని సలహా తీసుకుని ఓ బౌలర్ వేసిన ఓ వ్యూహాత్మక బంతితో.. మ్యాచ్‌లు మలుపు తిరిగిన సందర్భాలు ఎన్నో! ధోనీ జట్టుకు చేకూర్చే విలువ అది. జట్టులో ధోని ‘ఉనికి’ చూపించే ప్రభావం అది. అతనుంటే జట్టుకే కాదు.. అభిమానులకూ ఓ భరోసా! అందుకే అతను వేరు!
ఆటగాడిగానే కాదు.. వ్యక్తిగానూ ధోని చూపిన, చూపించబోయే ప్రభావం ప్రత్యేకమైంది. అతి సామాన్య నేపథ్యం నుంచి వచ్చినా.. పట్టుదలతో శ్రమిస్తే అత్యున్నత శిఖరాలకు చేరొచ్చనడానికి అతనో ఉదాహరణ. ఏ స్థితిలోనైనా ప్రశాంతత చెదరని.. ఎంత ఎదిగినా ఎగిరి పడని.. పొగడ్తలకు పొంగిపోని.. విమర్శలకు వెరవని అతడి వ్యక్తిత్వం విలక్షణం! ధోని బ్యాటింగ్‌లో సొగసుండదన్నది కొందరు చేసే విమర్శ. కానీ అతడి పరుగులు జట్టుకు చేకూర్చిన ప్రయోజనం అమూల్యం! మేటి జట్టు చేతిలో ఉండటం వల్లే ధోని అద్భుతాలు చేయగలిగాడన్నది కొందరు చేసే దెప్పిపొడుపు. అదే ‘మేటి’ జట్టు సంక్షోభ సమయాల్ని ఎదుర్కొన్నపుడు కాడి వదిలేయకుండా సంయమనం పాటించి, సంధి దశను దాటించి.. అంతా ‘సురక్షితం’ అనుకున్నపుడు పగ్గాలు విడిచిపెట్టిన యోగి ధోని. అందుకే అతను వేరు!
నిష్క్రమించాలని ఆ రోజే నిర్ణయించుకున్నాడా?
"చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సి ఉంటే.. ఒత్తిడుండేది ధోని మీద కాదు, బౌలర్ మీద".. ఒకప్పుడు వెస్టిండీస్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ చేసిన వ్యాఖ్య ఇది. ధోని ప్రత్యేకతను చాటిచెప్పే మాట ఇది. కానీ గత రెండు మూడేళ్లలో మహి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడం పోయి తనే ఒత్తిడిలో పడ్డ కొన్ని సందర్భాలు చూశాం. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో అది మరింత స్పష్టంగా కనిపించింది. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో ఔటై వెనుదిరిగాక మహి కళ్లలోని సన్నని కన్నీటి ధారే చెప్పేసింది.. అతడి కథ ముగిసిందని! జట్టుకు తన అవసరం ఉందనే ఆ టోర్నీ వరకు ఆడిన మహి.. ఆ రోజే నిర్ణయంచుకున్నట్లున్నాడు ఇక నిష్క్రమించాలని! కానీ ఇంకో ఏడాది ఉత్కంఠకు గురి చేసి.. ఎంతో చర్చకు తావిచ్చి. ఈ స్వాతంత్య్ర దినోత్సవాన రిటైర్మెంట్ కబురు చల్లగా చెప్పాడు.
మరి ధోని నిష్క్రమించాడని అంతర్జాతీయ క్రికెట్ ఆగిపోతుందా? అభిమానులు ఆగిపోతారా? ఏవీ ఆగవు! కానీ భారత క్రికెట్ ఇంతకు ముందులా మాత్రం ఉండదు! ‘‘ఈ సమయంలో ధోనీ ఉండుంటేనా’’ అని ఏదో ఒక సందర్భంలో అనుకోని అభిమాని ఉండడు! అలా అనుకున్న ప్రతిసారీ అర్థమవుతుంది.. భారత క్రికెట్‌పై ‘ధోని’ ఓ చెరిగిపోని సంతకమని!
మే పల్ దో పల్‌కా షాయర్
"నేను కవిని. అది క్షణ కాలానికో.. రెండు క్షణాలకో. నా కథ ఒకటో రెండో క్షణాల్లో ముగుస్తుంది. నా ఉనికీ అంతే. నా యవ్వనమూ క్షణమో రెండు క్షణాలో ఉంటుంది. నా కన్నా ముందు ఎంతో మంది కవులు వచ్చారు.. వెళ్లారు. రేపు ఇంకొందరు వస్తారు. వాళ్లు నాకన్నా బాగా రాస్తారు".
రిటైర్మెంట్ ప్రకటిస్తూ ధోని గుర్తు చేసుకున్న పాట (మే పల్ దో పల్‌కా షాయర్)లో కొంత భాగమిది. ప్రతి ఒక్కరి కథా ఏదో ఒక రోజు ముగియాల్సిందే, కొత్త కథ ప్రారంభం కావాల్సిందే అన్న భావంతో ధోని ఈ పాటను పోస్ట్ చేసి ఉండొచ్ఛు.
వివాదరహితుడు..