కెప్టెన్ కూల్..! మహేంద్ర సింగ్ ధోనీ గురించి మాట్లాడాల్సి వస్తే ఎవరైనా ఉపయోగించే మాట ఇది. భారత క్రికెట్ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు పగ్గాలు అందుకున్నాడు. టీమ్ఇండియాను అసమాన స్థాయికి చేర్చాడు. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని అత్యంత విజయవంతమైన సారథిగా నిలిచాడు. ఐసీసీ టోర్నీలన్నింటిలో భారత్‌ను విజేతగా నిలిపాడు. టెస్టుల్లో జట్టును అగ్రస్థానంలో నిలపడం సహా 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌ను అందించాడు.
క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్‌గా మారిన ధోనీ
జాన్ రైట్ నేతృత్వంలో గంగూలీ సారథ్యంలో అలలా ఎగసిపడింది భారత క్రికెట్ జట్టు. ఆ తర్వాత కోచ్‌గా వచ్చిన గ్రెగ్ చాపెల్ హయాంలో పాతాళానికి జారింది. ఈ దశలో ఎదురైందే 2007 వన్డే ప్రపంచకప్ ఓటమి. ఆ సమయంలో టీమ్ఇండియాలో సమూల మార్పులు చేసింది బీసీసీఐ. సీనియర్ల సూచన మేరకు వన్డే జట్టు పగ్గాలు ధోనీకి అప్పగించింది.
ధోనీ దగ్గర ఉండే ప్లాన్ బీ
దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్(2007)లో భారత్ జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు ధోని. తనకున్న వనరులను సమర్థంగా ఉపయోగిస్తూ భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ప్లాన్ బీ గురించి కూడా ఆలోచించేవాడు ధోనీ. పాక్‌తో లీగ్ మ్యాచ్‌కు మందు బౌల్ అవుట్ ప్రాక్టీస్.. ఆ మ్యాచ్‌లో విజయానికి కారణమైంది. ఆ తర్వాత ఫైనల్లో అద్భుత వ్యూహాలతో దాయాదిపై చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఆసీస్‌ను వారిగడ్డపైనే ఓడించాడు..!
వన్‌డౌన్‌లో అద్భుతంగా ఆడుతున్న ధోనీ.. కెప్టెన్ అయిన తర్వాత లోయరార్డర్కు మారాడు. టెయిలండర్లతో ఆడుతూ గొప్ప ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సారథిగానూ బాధ్యతలు అందుకున్నాడు. ఆసీస్‌ను వారిగడ్డపైనే ఓడించి సిరీస్ గెల్చుకున్నాడు.
అన్నింటా ధోనీదే కీలక పాత్ర