గతేడాది ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో చివరగా ఆడిన టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మహీ రీఎంట్రీ కోసం సుదీర్ఘ కాలం నుంచి అభిమానులు సహా మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అతడు మాత్రం ఇప్పటివరకు దీనిపై మౌనం పాటిస్తూ వచ్చాడు.
ఐపీఎల్‌తో జాతీయ జట్టులోకి
ఈ ఏడాది ఐపీఎల్లో సత్తాచాటి అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ జట్టులో మహీ చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. మార్చిలో చెన్నై సూపర్ కింగ్స్ శిక్షణా శిబిరంలో ధోనీ ప్రాక్టీసు కూడా చేశాడు. కానీ దేశంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో లాక్డౌన్ విధించగా ఐపీఎల్‌ను నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ. దీంతో అతడి కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
ప్రపంచకప్ వాయిదా పడింది .. మరి ధోనీ పరిస్థితేంటి?
బీసీసీఐ భావించినట్లు.. కరోనా నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఐసీసీ. దీంతో ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమమైంది. కానీ మహీ జాతీయ జట్టులోకి రీఎంట్రీపై మళ్లీ ఎదురుచూడాల్సి వస్తోంది. ఒకవేళ అక్టోబరులో ఈ మెగాటోర్నీ జరిగితే.. మహీ ఇందులో ఆడినప్పటికీ టీమ్ఇండియాకు ఆడే అవకాశం మాత్రం ముందుకు జరిగినట్లైంది.
మరి అప్పటికైనా ధోనీకి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలనే ఆలోచన ఉందా? లేక గుడ్‌బై చెప్తాడా? జట్టు మేనేజ్మెంట్ అతడిని ఎంపిక చేస్తుందా? అతడి కెరీర్‌కు బ్రేక్ పడినట్లేనా? అన్న అనుమానాలు అభిమానులు సహా పలువురు క్రికెటర్లలో మెదులుతున్నాయి. ప్రస్తుతం ఇదే విషయం నెట్టింట హాట్ టాపిక్ అయింది.
భిన్నాభిప్రాయాలు
ధోనీ భవితవ్యంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అతడు ఇంకా ఫామ్ కోల్పోలేదని, సత్తా అలానే ఉందని తప్పకుండా జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని కొంతమంది మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంటున్నారు. ఏదేమైనప్పటికీ అతడి భవితవ్యం తేలాలంటే మహీ నోరు విప్పేదాకా వేచి ఉండాల్సిందే.
పంత్, రాహుల్‌కు అవకాశం.. ధోనీ కష్టమే
ధోనీ తాత్కాలిక విరామం ప్రకటించాక... అతడి స్థానంలో యువ ఆటగాళ్లు పంత్, కేఎల్ రాహుల్ టీమ్ఇండియా వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. అయితే పంత్ నిరాశపరిచినప్పటికీ.. రాహుల్ మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది జరిగిన ఆరు వన్డేలు సహా టీ20ల్లో 70.00 స్ట్రైక్‌రేట్‌తో మంచి ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో బాగా రాణిస్తోన్న రాహుల్‌ను పక్కన పెట్టి.. ఆ స్థానాన్ని మళ్లీ ధోనీకి ఇచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కారణంతోనూ మహీని టీమ్ఇండియాలోకి తీసుకోవడం కష్టమని పలువురు భావిస్తున్నారు.
అసాధ్యాలను సుసాధ్యం చేశాడు
16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా అసాధ్యాలను సుసాధ్యం చేశాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఈ క్రమంలోనే అతడి ఖాతాలో ఎన్నో రికార్డులు వచ్చి చేరాయి. వన్డేల్లో అత్యధిక స్టంపింగ్‌లు, వన్డేల్లో సారథిగా 100కుపైగా విజయాలు, 200 సిక్స్‌లు కొట్టిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలవడమే కాకుండా మరెన్నో ఘనతలు తన పేరిట లిఖించుకున్నాడు.
ఐసీసీ టోర్నీలు అన్నింటిలో విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు మహీ. ఈతరం క్రికెటర్లకు ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.
ఇది చూడండి : అలా ధోనీ, సాక్షి ప్రేమలో పడ్డారు