16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా అసాధ్యాలను సుసాధ్యం చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఈ క్రమంలోనే అతడి ఖాతాలో ఎన్నో రికార్డులు వచ్చి చేరాయి. ఐసీసీ టోర్నీలు అన్నింటిలో విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈతరం క్రికెటర్లకు ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.
అపద్భాందవుడు ధోనీ
బ్యాటింగ్ చేయగల వికెట్ కీపర్ దొరక్క రాహుల్ ద్రవిడ్‌పై అదనపు భారం మోపి లాక్కొస్తున్న రోజులవి. పార్థివ్ పటేల్, అజయ్‌రాత్రాల లాంటి వచ్చివెళ్లే వాళ్లు తప్ప స్థిరత్వం ఉన్న కీపర్ బ్యాట్స్‌మెన్ దొరకడం లేదు. అలాంటప్పుడు 2004లో టీమిండియా తలుపు తట్టాడు ధోనీ. అనతికాలంలోనే నమ్మదగ్గ కీపర్‌గా, భరోసా ఉంచదగిన బ్యాట్స్‌మన్‌గా మారిపోయాడు. జట్టులోకి వచ్చిన మూడేళ్లలోపే సారథిగా మారి, దశాబ్దం పాటు ముందుండి నడిపించాడు.
వన్డేల్లో అత్యధిక స్టంపింగ్‌లు ధోనీవే
2004 డిసెంబర్ 23న తొలి వన్డే ఆడాడు ధోని. మొత్తం కెరీర్‌లో 350 వన్డేల్లో దాదాపు 51 సగటుతో 10,773 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 6 ఓవర్లు బౌలింగ్ చేసి, ఓ వికెట్ కూడా తీశాడు. ఈ ఫార్మాట్లో 321 క్యాచ్‌లు పట్టి, 123 స్టంపింగ్‌లు చేశాడు. వికెట్ల వెనుక అత్యంత చురుగ్గా ఉండే ఈ కీపర్.. 444 వికెట్లలో భాగస్వామ్యం పంచుకున్నాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక స్టంపింగ్‌ల రికార్డు ధోనీ పేరిటే ఉంది.
ఆ రికార్డు సాధించిన తొలి భారత కెప్టెన్
200 వన్డేలకు కెప్టెన్సీ వహించిన ధోనీ.. 110 విజయాలు సాధించాడు. తద్వారా 100కు పైగా వన్డే మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించిన ఏకైక ఆస్ట్రేలియేతర సారథిగా చరిత్ర సృష్టించాడు. సచిన్ తర్వాత 10వేల పరుగుల మైలురాయి అందుకున్న 4వ భారతీయ క్రికెటర్, రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు.
ఏకైక బ్యాట్స్‌మన్ మహీనే
మొత్తం కెరీర్‌లో 50 సగటుతో 10 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ ధోనీనే. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 4,031 పరుగులు చేశాడు. ఏడులో దిగి సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ స్థానంలోనే రెండు శతకాలు చేశాడు. వన్డేల్లో 82 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఫార్మాట్లో 200 సిక్స్‌లు బాదిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు.
అదే అత్యుత్తమ భాగస్వామ్యం