అనూహ్యంగా బీసీసీఐ నిర్ణయం..
ధోనీ రిటైర్మెంట్‌పై కొంతకాలంగా వస్తోన్న ఊహాగానాలకు మరింత ఊతమిచ్చే పరిణామం జనవరి 16న చోటు చేసుకుంది. అతడికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కలేదు. 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబరు కాలానికి కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన బోర్డు... అందులో నుంచి ధోనీ తప్పించింది. అయితే ఇదంతా మహీతో మాట్లాడాకే నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు స్పష్టం చేశారు. 2019 నుంచి ఒక్క మ్యాచ్ ఆడలేదనే కారణంతో ధోనీ కూడా పేరు తీసేయాలని చెప్పినట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.
రవిశాస్త్రి వ్యాఖ్యలతో చర్చ...
గతేడాది జులైలో న్యూజిలాండ్‌తో ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత నుంచి ధోనీ... అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అప్పట్నుంచి ఈ మాజీ సారథి రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అతడి వన్డే కెరీర్ దాదాపుగా ముగిసినట్లేనని టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఇటీవలే ప్రకటించడం చర్చనీయాంశమైంది. తాజాగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోనూ ధోనీ పేరు లేకపోవడం రవిశాస్త్రి ప్రకటనకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. అయితే ధోనీ మాత్రం తన రిటైర్మెంట్ గురించి ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. తన మనసులోని మాటను బయటపెట్టలేదు. రానున్న ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ బరిలో దిగుతాడని అందరూ అనుకుంటున్నారు. అతడు టీ20 ప్రపంచకప్‌లో ఆడే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా బోర్డు వర్గాలు ఇటీవలె పరోక్షంగా వెల్లడించాయి.
38 ఏళ్ల ధోనీ గతేడాది వరకు రూ.5 కోట్లు వార్షిక చెల్లింపు ఉన్న 'ఎ' విభాగంలో ఉన్నాడు. 2004 డిసెంబరు 23న అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మహీ... ఇప్పటిదాకా 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 3 ఫార్మాట్లలో కలిపి 17000 పైచిలుకు పరుగులు సాధించాడు. వికెట్ కీపర్‌గా 829 ఔట్లలో భాగమయ్యాడు.