తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహేంద్రజాలం లేక టీమ్‌ఇండియా వెలవెల! - ధోనీ మెదడు అద్భుతం

ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు టీమ్​ఇండియా రచిస్తోన్న వ్యూహాలు విఫలమవుతున్నాయి. జట్టులో చాహల్​, కుల్​దీప్​ వంటి మెరుగైన బౌలర్లు కూడా ఆకట్టుకోలేకపోతున్నారు. వీటన్నింటికీ కారణం జట్టులో ధోనీ లేకపోవడమేనా? అదే జట్టుకు బలహీనతగా మారిందా? వంటి అంశాల సమాహారమే ఈ కథనం.

dhoni
ధోనీ

By

Published : Dec 14, 2020, 11:37 AM IST

గత పదేళ్లలో మీరు చూసిన అత్యుత్తమ క్రికెట్‌ బుర్ర ఎవరిది? సునీల్‌ గావస్కర్‌ నుంచి మాథ్యూ హెడెన్‌ వరకు.. కెవిన్‌ పీటర్సన్‌ నుంచి వీవీఎస్‌ లక్ష్మణ్‌ దాకా.. హర్ష భోగ్లే నుంచి మురళీ కార్తీక్‌ వరకు ముక్తకంఠంతో చెప్పేదొక్కటే.. మహేంద్రసింగ్‌ ధోనీదే అని! అతడు ఆటను చదివే తీరుకు లేదు పోటీ. ఆటపై అతడి పరిజ్ఞానానికి రారెవరూ సాటి. ఉన్నన్నాళ్లూ అతడి క్రికెట్‌ బుర్ర జట్టుకు కొండంత బలం. ఇప్పుడదే బలం టీమ్‌ఇండియా బలహీనతగా మారిందా? అందుకే స్పిన్నర్లు రాణించడం లేదా? వ్యూహ రచనలో దెబ్బతింటోందా? ప్రణాళికల అమల్లో విఫలమవుతోందా?

ధోనీ

ఎన్నెన్నో అర్థాలు.. తర్కాలు

రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌ బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు స్టార్‌ పేసర్లు ఎవరూ దొరకలేదు. అప్పుడు దేశవాళీ యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌నే నమ్ముకున్నాడు ధోనీ. బంతిని రెండువైపులా స్వింగ్‌ చేసే అతడితోనే ఆరంభ ఓవర్లను వేయించేవాడు. పవర్‌ ప్లేలోనే వికెట్లు తీయించి విజయవంతం అయ్యేవాడు. ఆఖరి‌ ఓవర్లను మాత్రం అతడితో వేయించేవాడు కాదు. కానీ చాహర్‌కేమో డెత్‌ ఓవర్లు వేయాలని కోరిక. ఓ రోజు ధైర్యం చేసి 'ధోనీ భాయ్‌.. మీరెందుకు నాతో డెత్‌ ఓవర్లు వేయించడం లేదు' అని అడిగేశాడు. అప్పుడు మహీ చెప్పిన జవాబేంటో తెలుసా.. 'ఐ గ్రూమ్‌ యంగ్‌ ప్లేయర్స్‌' అని. ఈ ఒక్క మాటలో ఎన్నెన్నో అర్థాలు.. తర్కాలు.. విశ్లేషణలు వెతుక్కోవచ్చు.

ధోనీ

మహీ భిన్నం

అంతర్జాతీయ క్రికెట్లో తెలివైన ఆటగాళ్లు, సారథులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎంఎస్ ధోనీ మాత్రం అందరికీ భిన్నం. అతడి క్రికెట్‌ పరిజ్ఞానానికి మరొకరు సాటిరారు. అతడి ప్రతిభకు మరొకరు పోటీకారు. ఆటను మహీ అధ్యయనం చేసే విధానం అపురూపం. అవతలి జట్టులో ఎవరి బలాబలాలేంటి? ఎవరెప్పుడు బౌలింగ్‌ చేస్తారు? ఎలాంటి బంతులు వేస్తారు? ఏ బ్యాట్స్‌మన్‌ ఎలా ఆడతాడు? ఏ ప్రణాళికలు అమలు చేస్తారు? పిచ్‌ ఎలా ఉంది? మ్యాచ్‌ సమయంలో వాతావరణం ఎలా ఉంటుంది? 24 గంటల ముందు ఎలా ఉండేది? వర్ష సూచన ఉందా? మ్యాచులో ఏ సమయంలో పడే అవకాశం ఉంది? వంటి వివరాలన్నీ కూలంకషంగా గమనిస్తాడు. జట్టు యాజమాన్యంతో కలిసి వ్యూహాలు రచించి ఎదురుదాడికి దిగుతాడు. అప్పటి వరకు ఎవరికీ పరిచయం లేని ఆటగాళ్లతో అద్భుతాలు చేయిస్తాడు. ప్రత్యర్థులను వణికిస్తాడు. దీపక్‌ చాహర్‌, హార్దిక్‌ పాండ్య, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవే‌ ఇందుకు ఉదాహరణ. వారికి బౌలింగ్‌లో ప్రాథమిక అంశాలు తెలిస్తే చాలు! ఏ లైన్‌.. ఏ లైంగ్త్‌.. ఎక్కడ పిచ్‌ చేయాలి? ఎలాంటి డెలివరీ వేయాలి? ఫీల్డర్లను ఎక్కడ మోహరించాలి? ఏ బంతి వేసి బ్యాట్స్‌మన్‌ను ఎలా ఆడించాలి? అన్నది ధోనీ చెప్పేస్తాడు.

స్టంప్​ ఔట్​ చేస్తోన్న ధోనీ

స్పిన్నర్లపై ప్రభావం

టీమ్‌ఇండియా ఇప్పుడు ధోనీ సేవల్ని బాగా మిస్సవుతోంది. వికెట్ల వెనక నుంచి అతడి సలహాలు లేకపోవడం వల్ల స్పిన్నర్లు ఇబ్బంది పడుతున్నారు. యూజీ, కుల్‌దీప్‌, జడ్డూ ఒకప్పటిలా కనిపించడం లేదు' అని ఈ మధ్యే కిరణ్‌ మోరె అన్నారు. సన్నీ, వెంగీ, హెడెన్ వంటి విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి మాటలకు తగ్గట్టే భారత స్పిన్నర్లు, కొన్నిసార్లు పేసర్ల ప్రదర్శనలో పస, కసి కనిపించడం లేదు. ప్రత్యర్థులు వారిని సులువుగా ఆడేస్తున్నారు. చైనామన్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న కుల్‌దీప్‌పై ధోనీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అతడే అంగీకరించాడు. వన్డే ప్రపంచకప్‌ ముందు నుంచే అతడు ఫామ్‌ కోల్పోయాడు. ఒకప్పటిలా వికెట్లు తీయలేకపోతున్నాడు.

కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 88 మ్యాచులాడిన కుల్‌దీప్‌ 23.17 సగటు, 27.9 స్ట్రైక్‌రేట్‌తో 168 వికెట్లు తీశాడు. 2017లో 27.7.. 2018లో 22.2.. 2019లో 36.2 బంతులకు ఒక వికెట్‌ తీసిన అతడు 2020లో 40.5 బంతులకు గానీ వికెట్‌ తీయలేకపోయాడు. ఈ ఏడాది 7 మ్యాచుల్లో 8 వికెట్లే తీశాడు. జట్టులో చోటూ కష్టమవుతోంది. ఆసీస్‌తో వన్డేలో 57 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. జడ్డూ పరిస్థితీ ఇలాగే కనిపిస్తోంది. మునుపటిలా పరుగులు నియంత్రించడం లేదు. వికెట్లూ తీయడం లేదు. 2018లో 8 వన్డేల్లో 14.. 2019లో 15 మ్యాచుల్లో 12, 2020లో 9 మ్యాచుల్లో 7 వికెట్లే తీశాడు. అంటే గత రెండేళ్లలో అతడు 65 బంతులకు కూడా ఒక్క వికెట్‌ తీయలేకపోయాడు. టీ20ల్లోనూ అంతే. మొత్తంగా 2020లో 14 మ్యాచులాడి అతడు తీసింది 13 వికెట్లే. యూజీ పరిస్థితీ భిన్నంగా ఏమీ లేదు. 13 మ్యాచుల్లో 7.86 ఎకానమీ, 41.57 సగటుతో 14 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీసుల్లో ఎక్కువ పరుగులే ఇచ్చాడు. మొత్తంగా ఎకానమీ ఫర్వాలేదు కానీ సమయోచితంగా వికెట్లు తీయలేకపోతున్నాడు. జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ కూడా ఒక్కోసారి లయ కోల్పోతున్నారు.

ధోనీ, జడేజా, కుల్​దీప్​

రోహిత్‌ ఉన్నా..

విరాట్‌ కోహ్లీ సారథ్య బాధ్యతలు అందుకున్నాక ధోనీ అతడికి అండగా ఉన్నాడు. ఎన్నో సార్లు మహీ సలహాలు ఇవ్వడం చూశాం. వ్యూహాలు రచించడం, వాటిని సక్రమంగా అమలు చేయడం, ప్రత్యర్థులపై వల పన్నడంలో సాయపడేవాడు. ఏమైనా పొరపాట్లు జరుగుతుంటే మందలించేవాడు. లాంగాఫ్‌, లాంగాన్‌లో కోహ్లీ ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు ధోనీ బౌలర్లకు మార్గనిర్దేశం చేసేవాడు. మ్యాచ్‌ పరిస్థితికి తగ్గట్టుగా బంతులు వేయించేవాడు. ఏ లైన్‌, ఏ లెంగ్త్‌లో బంతులను పిచ్‌ చేయాలో హిందీలో ఆదేశించేవాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా ఇదే మిస్సవుతోంది. ఫీల్డర్లకు ఆదేశాలు ఇచ్చేందుకు ఇప్పుడు కోహ్లీ అంతర్‌వృత్తంలో ఉండాల్సి వస్తోంది. వికెట్‌ కీపర్‌గా రాహుల్‌ అదరగొడుతున్నా.. బౌలర్లకు సలహాలు ఇస్తున్నా అతడికి ఇంకా పరిణతి, అనుభవం అవసరం. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ధోనీ పాత్రను బాగానే పోషించాడు. అయితే అతడు మరింత చాకచక్యంగా మారాలి. ఆసీస్‌తో ఆఖరి టీ20లో నటరాజన్‌ బౌలింగ్‌లో మాథ్యూవేడ్‌ సమీక్ష విషయంలో ఇది స్పష్టంగా కనిపించింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి కోహ్లీకి ధోనీలాంటి అండ కరవైంది. రోహిత్‌కు అలాంటి అనుభవం, అణకువ, పరిణతి, పరిజ్ఞానం ఉన్నా కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ మధ్య బంధం పరిస్థితి ఏంటో ఎవరికీ తెలీదు కదా మరి!

ధోనీ కోహ్లీ రవిశాస్త్రి

ఇదీ చూడండి :'ధోనీ సలహాలు మిస్సవుతున్న కోహ్లీసేన'

ABOUT THE AUTHOR

...view details