భారత క్రికెట్‌లో మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాళ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లిద్దరూ దిగ్గజాలనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మైదానం లోపలా.. బయటా.. మంచి స్నేహితులనే విషయం కూడా తెలిసిందే. ఇద్దరూ పరస్పరం గౌరవించుకునే ఆటగాళ్లు. ఒకసారి మాజీ సారథి ధోనీ.. కోహ్లీ కోసం ఓ చిన్నపాటి త్యాగం చేశాడు. ఆ వీడియోను ఐసీసీ తాజాగా టీమ్‌ఇండియా అభిమానులతో పంచుకుంది. అదేంటో.. దాని విశేషాలేంటో తెలుసుకుందాం.
కోహ్లీ కోసం ధోనీ త్యాగం.. మీరే చూడండి!
2014 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ కోసం ఓ చిన్న త్యాగం చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. తాజాగా ఆ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది ఐసీసీ. అదేంటో మీరూ చూసేయండి.
ధోనీ 2013లో భారత జట్టును ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలబెట్టగా.. 2014 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్స్ వరకూ తీసుకెళ్లాడు. అక్కడ లంక చేతిలో భారత్ ఓటమిపాలైంది. అయితే, అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్‌లో ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. అదే కోహ్లీ కోసం ధోనీ త్యాగం చేయడం. సెమీఫైనల్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 172/4 పరుగులు సాధించింది. అనంతరం కోహ్లీ (72 నాటౌట్; 44 బంతుల్లో 5x4, 2x6) అర్ధశతకంతో రెచ్చిపోవడం వల్ల భారత్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆ మ్యాచ్ 19 ఓవర్లకే పూర్తి అవ్వాల్సి ఉన్నా చివరి ఓవర్ వరకూ వెళ్లిందంటే కారణం ధోనీనే.
బ్యూరన్ హెండ్రిక్స్ వేసిన 18.5వ బంతికి కోహ్లీ సింగిల్ తీయడం వల్ల టీమ్‌ఇండియా స్కోరు దక్షిణాఫ్రికాతో సమం అయింది. తర్వాతి బంతికి ధోనీ ఒక పరుగు తీస్తే భారత్ విజయం సాధిస్తుందనగా డిఫెన్స్ ఆడి వదిలేశాడు. మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ అది చూసి నవ్వుకున్నాడు. అలా ఎందుకు చేశావని కెప్టెన్‌ను చూస్తూ సైగలు చేశాడు. అయితే, కోహ్లీ అప్పటికే 68 పరుగులతో ఉండడం వల్ల.. విన్నింగ్ షాట్ కూడా అతడే కొట్టాలని ధోనీ భావించాడు. దీంతో స్టెయిన్ వేసిన చివరి ఓవర్ తొలి బంతిని కోహ్లీ ఫోర్‌గా మలిచి జట్టును గెలిపించాడు. ఆ వీడియోనే ఐసీసీ తాజాగా ట్విట్టర్లో పంచుకుంది. మీరూ కూడా దాన్ని చూసి ఆస్వాదించండి.