తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ రికార్డు సాధించనున్న మొదటి క్రికెటర్ ధోనీ! - ఐపీఎల్​లో 150 కోట్లకు ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ ఐపీఎల్​లో రికార్డు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. వచ్చే ఐపీఎల్​లో మహీ బరిలో దిగితే ఈ లీగ్​లో రూ.150 కోట్లు వేతనం అందుకున్న తొలి క్రికెటర్​గా నిలుస్తాడు.

Dhoni
ధోనీ

By

Published : Jan 9, 2021, 10:25 AM IST

చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. వచ్చే ఐపీఎల్‌లో ధోనీ బరిలో దిగితే ఈ లీగ్‌లో అత్యధికంగా రూ.150 కోట్లు వేతనం తీసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఐపీఎల్‌లో మొత్తం 13 సీజన్‌లు కలుపుకొని అత్యధికంగా రూ.137 కోట్లు వేతనంగా తీసుకున్న ఆటగాడు ధోనీనే.

2008లో ఏడాదికి రూ.6 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ.18 కోట్లకు ధోనీని చెన్నై కొనుక్కుంది. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వేతనం నిబంధనల్లో సడలింపులు ఇవ్వడం వల్ల ధోనీ జీతం రూ.8.28 కోట్లకు పెరిగింది. ఈ ఒప్పందం మూడేళ్లు కొనసాగింది. 2014, 2015లలో ధోనీ ఏడాదికి రూ.12.5 కోట్లు సంపాదించాడు. రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ తరఫున రెండేళ్లు ఆడిన ధోనీకి రూ.25 కోట్లు లభించాయి.

2018లో మరోసారి చెన్నై పగ్గాలు చేపట్టిన ధోనీ ఏడాదికి రూ.15 కోట్లు చొప్పున మూడేళ్లలో రూ.45 కోట్లు సంపాదించాడు. 2021 సీజన్‌లోనూ ధోనీకి రూ.15 కోట్లు లభిస్తాయి. దీంతో ఐపీఎల్‌ మొత్తంలో రూ.150 కోట్లు వేతనంగా తీసుకున్న ఆటగాడిగా ధోనీ రికార్డు నెలకొల్పుతాడు. అవార్డులు, రివార్డులు అన్నీ లెక్కేస్తే ధోనీ ఆదాయం రూ.200 కోట్లు దాటొచ్చని అంచనా.

తర్వాత రోహిత్, కోహ్లీ

ఇక ఇప్పటి వరకు రూ.131 కోట్లతో రోహిత్‌శర్మ ద్వితీయ, రూ.126 కోట్లతో విరాట్‌ కోహ్లీ తృతీయ స్థానాల్లో ఉన్నారు. వచ్చే సీజన్‌లో రోహిత్‌కు ముంబయి ఇండియన్స్‌ రూ.15 కోట్లు ఇస్తుంది. అంటే.. రూ.146 కోట్లతో రోహిత్‌ రెండో స్థానంలో ఉంటాడు. బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ కోహ్లీకి రూ.17 కోట్లు ఇస్తుంది. రూ.143 కోట్లతో కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతాడు. 2021 ఐపీఎల్‌లో బరిలో దిగితే సురేశ్‌ రైనా, డివిలియర్స్‌లు రూ.100 కోట్ల మైలురాయిని అధిగమిస్తారు.

ABOUT THE AUTHOR

...view details