అందరూ క్రికెటర్లలానే మైదానంలో తనకూ కోపం, అసహనం వస్తాయని అంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. కానీ భావోద్వేగాలు నియంత్రించుకోగలనని అన్నాడు. తాజాగా జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన ఈ క్రికెటర్.. తన కెరీర్‌లోని పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.
"అందరిలానే నాకూ భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఇతరుల కంటే వాటిని బలంగా నియంత్రించుకోగలను. మైదానంలో ఎన్నోసార్లు నిరాశకు గురయ్యాను. కోపం, అసహనం వచ్చేవి. ఆ క్షణంలో నా భావోద్వేగాల కంటే జట్టును ముందుకు నడిపించడమే ముఖ్యం. అప్పుడు వాటిని అధిగమించి మ్యాచ్‌పై దృష్టి సారిస్తాను. తర్వాత బంతిని ఎవరికి అందివ్వాలి? బరిలోకి ఎవరిని దించాలి? అనే వాటి గురించి ఆలోచిస్తాను. ఆ తర్వాత భావోద్వేగాల గురించి నేను మర్చిపోతాను"
-మహేంద్ర సింగ్ ధోనీ, భారత మాజీ సారథి