జులైలో భారత టాప్ క్రికెటర్లకు ఆరు వారాల క్యాంప్‌ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). ఈ క్యాంప్‌లో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి అవకాశాన్ని కల్పిస్తారా? లేదా? అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని జులై మూడో వారం నుంచి ఈ శిబిరాన్ని నిర్వహించడానికి ఓ సురక్షిత వేదికను త్వరలోనే నిర్ణయించనుంది బీసీసీఐ. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఆటగాళ్లు వారి ఐపీఎల్ శిక్షణా శిబిరాలకు వెళతారని తెలుస్తోంది.
టీమ్ఇండియా టాప్ ఆటగాళ్లతో శిక్షణా శిబిరం ఏర్పాటు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంటే ధోనీని ఇందులో ఎంపిక చేస్తారా? లేదా? అనేది ఇప్పుడు అందర్ని తొలుస్తున్న ప్రశ్న. ఎందుకంటే గతేడాది ప్రపంచకప్ తర్వాత బీసీసీఐ ఒప్పందం నుంచి తొలగించడమే అందుకు కారణం. ధోనీని శిక్షణా శిబిరానికి బీసీసీఐ ఎంపిక చేస్తుందా.. అనే అంశంపై పలువురు క్రీడా విశ్లేషకులు ఏమంటున్నారో తెలుసుకుందామా.
క్యాంప్‌లో ధోనీ ఉండాలి
శిక్షణా శిబిరంలో ధోనీ ఉండడం వల్ల యువ కీపర్లను గైడ్ చేయగలడని అభిప్రాయపడ్డాడు టీమ్ఇండియా మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. "టీ20 ప్రపంచకప్ జరుగుతుందో లేదో నాకు స్పష్టత లేదు. ఒకవేళ అది జరిగితే టోర్నీకి ముందు శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తారు. అందులో ధోనీ కచ్చితంగా ఉండాలి. టీ20 ప్రపంచకప్ జరగకపోతే ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం ఇప్పటికే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సంజు శాంసన్ జట్టుకు అందుబాటులో ఉన్నారు" అని ఎమ్మేస్కే ప్రసాద్ అన్నాడు.
టీమ్‌లో కచ్చితంగా ఉంటాడు
టీమ్ఇండియా ఆడే ప్రతీ మ్యాచ్‌లో ధోనీకి తప్పక స్థానం ఉండాలని ఆశిస్తున్నాడు మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా. "నేను అంతర్జాతీయ జట్టు సెలక్టర్ అయితే జట్టులో ధోనీకి కచ్చితంగా స్థానం ఉంటుంది. కానీ, ప్రస్తుతం అతను ఆడటానికి సిద్ధంగా ఉన్నాడా? లేదా? అనేది పెద్ద ప్రశ్న. అది ధోనీ కోరుకునే దానిపై ఆధారపడి ఉంటుంది" అని నెహ్రా అన్నాడు. ఒకవేళ అంతర్జాతీయ జట్టులో రావాలని ధోనీ అనుకుంటే..ఐపీఎల్ తన ఉత్తమ ప్రదర్శన కనబరిస్తే చాలని అభిప్రాయపడ్డాడు నెహ్రా.