గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియా మాజీ సారథి ధోనీ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. ఒకవేళ మహీ మళ్లీ ఆడితే మునుపటిలా జోరు చూపగలడా? బ్యాటింగ్‌తో అలరిస్తాడా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ క్రమంలో స్పందించిన స్పిన్నర్ పీయూష్ చావ్లా.. ధోనీ సామర్థ్యంపై అనుమానపడాల్సిన అవసరమే లేదన్నాడు. ఫుల్ ఫామ్‌లో ఉన్నాడని చెప్పాడు. కామెంటేటర్ ఆకాశ్ చోప్రాతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాల్ని వెల్లడించాడు.
"సుదీర్ఘ విరామం తర్వాత ఓ క్రికెటర్, తిరిగి మైదానంలో అడుగుపెడితే మునపటిలాగా ఆడగలడా? అనే అనుమానం సగటు వీక్షకుడిలో ఉంటుంది. కానీ ధోనీ మీద మాత్రం అలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహీ మ్యాచ్‌లో ఆడేటప్పుడు ఎలాంటి తీవ్రత కనబరుస్తాడో.. ఇటీవలే మార్చిలో జరిగిన సీఎస్కే శిక్షణ శిబిరంలోనూ బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీసు చేస్తున్నప్పుడు అలానే కనిపించాడు. క్యాంపులోని సురేశ్ రైనా, అంబటి రాయుడు, ధోనీ, మురళీ విజయ్‌తో పాటు పలువురు ఆటగాళ్లకు దాదాపు 2 నుంచి 2.30 గంటల సేపు నిరంతరాయంగా బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉంది. దాదాపు 200 నుంచి 250 బంతులు ఆడగలరు"
-పీయీష్ చావ్లా, టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్