మ్యాచ్ పరిస్థితులను అధ్యయనం చేయడంలో మహేంద్రుడు దిట్ట! తెలివైన చదరంగ నిపుణులు ప్రత్యర్థి చేత ఎలాంటి ఎత్తులు వేయించి ఓడించాలో ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. మనోఫలకంపై ముద్రించుకున్న మేరకే పావులు కదుపుతారు. మహీ కూడా అంతే. ఆడేది 20 లేదా 50 ఓవర్లైనా ప్రత్యర్థి చేత ఏం చేయించి ఓడించాలో ముందే ఊహిస్తాడు. ఆటలో ఎప్పుడేం చేయాలో అతడికి బాగా తెలుసు! క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్‌ను ఎలా బోల్తా కొట్టించాలో, బౌలర్‌పై ఎలా ఒత్తిడి పెంచాలో తెలుసు. అనూహ్యంగా ఆఖరి ఓవర్లను సాధారణ బౌలర్లతో వేయించి విజయాలెన్నో అందించిన ఘటనలు మనం చూశాం. చెపాక్‌లో మేఘాలను చూసి వర్షం ఎన్ని ఓవర్ల సమయంలో పడుతుందో అంచనా వేయగల సామర్థ్యం అతడి సొంతం. క్రికెట్ నియమావళిపై అతడికున్న అవగాహన సమకాలీన క్రికెటర్లలో ఎవ్వరికీ లేదని ఘంటాపథంగా చెప్పొచ్చు.
తెలివైన బ్యాట్స్‌మెన్
బ్యాట్స్‌మన్‌గా మహీ శైలి ప్రత్యేకం. వన్‌డౌన్ నుంచి ఏడో స్థానం వరకు ఆడినా వన్డేల్లో పదివేల పరుగులు చేశాడు. కెరీర్ మొదట్లో క్రీజులోకి అడుగుపెట్టిన క్షణం నుంచి వీరబాదుడు బాదేవాడు. ఆఖరి వరకు అలాగే దంచేవాడు. ఆ తర్వాత శైలి మార్చాడు. మొదటి నాలుగు వికెట్లు పడ్డప్పుడు ప్రశాంతంగా ఆడటం మొదలుపెట్టాడు. సింగిల్స్ లేదా డబుల్స్‌కే పరిమితం అయ్యేవాడు. రన్‌రేట్‌పై కచ్చితమైన అంచనాతో ఉండేవాడు. రన్‌రేట్ తగ్గుతుందేమో అన్నప్పుడు ధనాధన్ సిక్సర్ బాదేసి మళ్లీ సింగిల్స్ మొదలెట్టేవాడు. దాంతో బౌలర్లకే ఏం చేయాలో తోచేది కాదు. అందుకే అతడు ఆఖరి ఓవర్లో క్రీజులో ఉండి చేయాల్సిన పరుగులు ఎక్కువే ఉన్నా ఒత్తిడి బౌలర్‌పైనే ఉండేది. అతడు క్రీజులో ఉంటే అదో ధైర్యం!
బౌలర్‌ను మించిన బౌలర్
టీమ్‌ఇండియా బౌలింగ్‌పై ధోనీది చెరగని ముద్రే. అదేంటీ అతడు వేసింది ఒకటో రెండో ఓవర్లే కదా అంటారా! పిచ్, వాతావరణాన్ని అధ్యయనం చేయడంలో మహీ దిట్ట అని తెలుసు. అయితే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ బలాబలాలు, వారి ఆటతీరు, వారి బ్యాటింగ్ శైలిపైనా అతడికి మంచి అవగాహన ఉంటుంది. అందుకే దీపక్ చాహర్ లాంటి అనుభవం లేని పేసర్‌ను తీసుకొని నిషేధం తర్వాత ఐపీఎల్ ట్రోఫీ అందించగలిగాడు. ఏ బ్యాట్స్‌మెన్‌కు ఎక్కడ? ఎలా? బంతులు వేయాలో మహీ చెప్తాడు. బౌలర్లు ఆ సూచనను పాటిస్తే చాలు. సాధారణ బౌలర్‌తోనూ అతడు అద్భుతాలు చేయిస్తాడు. బౌలింగ్‌పై ధోనీ ప్రభావమేంటో కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌ను అడిగితే బాగా చెప్తారు. ఇక బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచులో ఓటమి అంచున నిలిచిన జట్టును హార్దిక్ పాండ్యతో ఆఖరి ఓవర్ వేయించి గెలిపించిన తీరు ఎప్పటికీ గుర్తుంటుంది.
సాటిలేని కీపర్
ఇక మహేంద్రుడి బలమే వికెట్ కీపింగ్. కెరీర్ తొలినాళ్లలో అనుభవలేమితో ఇబ్బందులు పడ్డా కాలం గడిచే కొద్దీ ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్‌గా అవతరించాడు. ఒకప్పుడు ఒకటో రెండో బంతులు వదిలేసిన అతడు బంతి గింగిరాలు తిరిగి వికెట్ల పక్కనుంచి పోతుందేమోనని కాళ్లు పక్కకు చాపి ఆపగలిగే స్థితికి చేరుకున్నాడు. మైక్రో సెకన్లలో వ్యవధిలో అతడు స్టంపింగులు చేస్తాడు. 350 వన్డేల్లో ఏకంగా 123 స్టంపులు చేశాడు. ఇందులో ముప్పావు శాతం 0.08-0.10 సెకన్లలోనే చేసినవి. స్టంపింగ్ చేశాక ధోనీ ఆత్మవిశ్వాసం చూసి అంపైర్లు ఔటిచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కీపర్‌గా అతడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.