నాయకుడు అనే వాడు ఎలా ఉండాలి? ఎలాంటి లక్షణాలు అవసరం? అసలు నాయకులను తయారు చేయవచ్చా? ఈ విషయాల కోసం అమెజాన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో వెతికితే 8వేలకు పైగా పుస్తకాల పేర్లు, వస్తాయి. కానీ మహేంద్రసింగ్ ధోనీ ఆ పుస్తకాలు చదివిన దాఖలాలు కూడా లేవు. కనీసం తను ఫస్ట్‌క్లాస్, 'ఎ' జట్ల స్థాయిలో అయినా నాయకత్వం వహించలేదు. తనే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం 5వ తరగతికి వచ్చే వరకు కనీసం తనెప్పుడూ క్రికెట్ మ్యాచ్ చూసి ఎరగడు. క్రికెట్టే సర్వస్వం అనుకున్న విద్యార్థి అంతకంటే కాదు. అలాంటి ఓ పంప్‌హౌస్ ఆపరేట్ కుమారుడు భారత క్రికెట్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా కెరీర్ ఎలా సాగించాడో తెలుసుకుందాం.
ఆరేళ్ల క్రితం 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా..టెస్ట్ సిరీస్ మధ్యలోనే ఆ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు ధోనీ. యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ టెస్ట్‌ల నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. కానీ ఈ ప్రస్థానంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే! భారత క్రికెట్ అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కెప్టెన్సీకి రావడమే కాదు. అదే ఏడాది టీ20 ప్రపంచకప్‌తో ఊహించని విజయాలను పరిచయం చేయడం ప్రారంభించాడు. కొత్త రక్తానికి అవకాశాలిస్తూ, వారిని అనునయిస్తూ వారి నరనరాల్లో గెలవాలనే కసిని, అందుకు కావాల్సిన స్ఫూర్తినీ నింపుతూ వచ్చాడు. అలా అతడి మిస్టర్ కూల్ కెప్టెన్సీ, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేని విలక్షణ అంతరంగమే ప్రత్యర్థులనూ బోల్తా పడేలా చేస్తూ వచ్చాయి.
ఉద్విగ్నఘట్టం
ఆటలోనూ ఇంతే. ఎప్పుడూ తన దెబ్బకు ప్రత్యర్థి తల వంచాల్సిందే. అందుకు అత్యుత్తమ ఉదాహరణ 2011. ఆ టోర్నీ ఫైనల్‌లో స్పిన్నర్లను ధాటిగా ఎదుర్కోవడానికి... ముఖ్యంగా స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీని. తనకు తాను బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి వచ్చి.. కోహ్లీ నిష్క్రమణ వెంటనే క్రీజ్ లోకి అడుగు పెట్టాడు. తన కెరీర్‌లో ఓ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి 79 బంతుల్లో 91పరుగులు చేశాడు. నిజానికి నాటి విజయంలో ధోనీ ఆ ప్రదర్శన, మరీ ముఖ్యంగా ఆఖర్లో సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించిన తీరుని ఇప్పటికీ, ఎప్పటికీ ఎవరూ మరచి పోలేరు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది మదిలో అది కలకాలం నిలిచి ఉండే ఉద్విగ్నఘట్టం. నిజానికి ఆరోజు ఊహించని రీతిలో ధోనీ ముందే బ్యాటింగ్‌కు రాకపోయి ఉంటే... ఫలితం ఎలా ఉండేదో కచ్చితంగా చెప్పలేక పోయే వాళ్లం.