సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పరుగల ప్రవాహం కొనసాగిస్తున్నాడు కర్ణాటక జట్టు ఆటగాడు దేవదత్ పడిక్కల్. ఇటీవల జరిగిన కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్), విజయ్ హాజారే ట్రోఫీలోనూ అత్యధిక పరుగుల వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు.
కేపీఎల్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 310 పరుగులు చేసిన దేవదత్.. నాలుగు అర్ధశతకాలు నమోదు చేశాడు. ఆ తర్వాత విజయ్ హాజారే ట్రోఫీలోనూ 11 ఇన్నింగ్స్‌ల్లో 609 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. ఆ జట్టు ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడీ యువ క్రికెటర్.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా.. సోమవారం ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కన్నడ జట్టు తరఫున సెంచరీతో ఆకట్టుకున్నాడు దేవదత్. పిన్న వయసులోనే ఈ టోర్నీలో సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా ఘనత సాధించాడు. మొత్తంగా ఈ మ్యచ్‌లో 122 రన్స్ (60 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్లు)తో నాటౌట్‌గా నిలిచాడు.
హిట్‌మ్యాన్‌ను దాటేశాడు...
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ సాధించిన మూడో పిన్న వయస్కుడిగా(19 ఏళ్ల 127 రోజులు) అరుదైన ఘనత సాధించాడు దేవదత్. ఇప్పటివరకు మూడో స్థానంలో ఉన్న రోహత్‌శర్మ(19 ఏళ్ల 339 రోజులు)ను నాలుగో స్థానానికి నెట్టాడు. 18 ఏళ్ల విజయ్ జోల్ 2013లో ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 109 పరుగులు చేశాడు. అదే ఇప్పటికీ టాప్-1 రికార్డుగా ఉంది.
సెహ్వాగ్ రికార్డు బ్రేక్...
ఈ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్(122 నాటౌట్) సాధించి... ఈ జాతీయ టీ20 ట్రోఫీ చరిత్రలో చేధనలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో 2011 ఐపీఎల్‌లో సెహ్వాగ్ చేసిన 119 పరుగుల రికార్డు బ్రేక్ అయింది. 2017-18 ఎడిషన్‌లో దిల్లీ ఆటగాడు రిషభ్ పంత్(116) హిమాచల్ ప్రదేశ్‌పై నెలకొల్పిన రికార్డునూ తిరగరాశాడు.
టీ20 చేధనలో ఓ కర్ణాటక బ్యాట్స్‌మన్ నెలకొల్పిన అత్యధిక పరుగులు కూడా ఇవే కావడం విశేషం. 2011 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున పాల్ వాల్తాటి(120 నాటౌట్) నెలకొల్పిన రికార్డును అధిగమించాడు.