ఐపీఎల్లో పాల్గొనేందుకు దిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు కూడా చిట్టచివరగా దుబాయ్ చేరుకున్నాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే మిగతా టీమ్‌ల్లోని భారత క్రికెటర్లు ఇప్పటికే ఆతిథ్య దేశానికి చేరుకుని, క్వారంటైన్లో ఉన్నారు.
ఐపీఎల్: దుబాయ్‌లో ఆ రెండు జట్లు అడుగుపెట్టేశాయ్ - ఐపీఎల్ తాజా వార్తలు
దిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ దుబాయ్‌లో అడుగుపెట్టాయి. దీంతో అన్ని జట్లలోని భారత ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నట్లయింది. సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో వారికి వైద్యపరీక్షలు నిర్వహించి, ఆ తర్వాతే బయో సెక్యూర్ వాతావరణంలోకి అనుమతిస్తారు.
హైదరాబాద్-దిల్లీ జట్లు
మన దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న కారణంగా యూఏఈలో ఐపీఎల్‌ను జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు జట్లకు చెందిన భారత క్రికెటర్లందరూ ప్రత్యేక విమానాల్లో ఆ దేశానికి చేరుకున్నారు. హోటల్స్‌లోని కేటాయించిన గదుల్లో ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. ఈ సమయంలోనే వారికి మూడుసార్లు కరోనా పరీక్షలు చేయనున్నారు. దీనితో పాటే మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు కూడా ప్రతి ఐదురోజులకు ఓసారి అన్ని జట్ల ఆటగాళ్లకు వైద్యపరీక్షలు జరపనున్నారు.