తెలంగాణ

telangana

ETV Bharat / sports

డీడీసీఏ అధ్యక్ష పదవికి రజత్​ శర్మ రాజీనామా..! - దిల్లీ డిస్ట్రిక్ట్​ క్రికెట్​ అసోసియేషన్

దిల్లీ డిస్ట్రిక్ట్​ క్రికెట్​ అసోసియేషన్​(డీడీసీఏ) అధ్యక్ష పదవికి అనూహ్యంగా రాజీనామా ప్రకటించారు రజత్​ శర్మ. 20 నెలల పదవిలో కొనసాగిన ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై మాట్లాడిన డీడీసీఏ డైరెక్టర్​ ఆర్పీ సింగ్​... రజత్​ రాజీనామా ఆమోదించలేదని తెలిపారు. బోర్డు అత్యున్నత మండలి దీనిపై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

డీడీసీఏ అధ్యక్ష పదవికి రజత్​శర్మ రాజీనామా

By

Published : Nov 16, 2019, 10:29 PM IST

Updated : Nov 16, 2019, 11:16 PM IST

దిల్లీ డిస్ట్రిక్ట్​ క్రికెట్​ అసోసియేషన్​(డీడీసీఏ)లో విభేదాలు బహిర్గతమయ్యాయి. అంతర్గతంగా నెలకొన్న కారణాల వల్ల ఆ సంఘం అధ్యక్షుడు రజత్​శర్మ రాజీనామా చేశారు. ఇప్పటివరకు ఈ పదవిలో 20 నెలలు కొనసాగిన ఆయన... అనూహ్యంగా పదవికి గుడ్​బై చెప్పేశారు. అయితే ఆ రాజీనామాను ఇంకా ఆమోదించలేదని తెలిపారు డీడీసీఏ డైరెక్టర్​ ఆర్పీసింగ్​. ఈ అంశంపై బోర్డు అత్యున్నత మండలి(అపెక్స్​ కౌన్సిల్​) తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రధాన కార్యదర్శి వినోద్ తిహారాతో నెలకొన్న బహిరంగ విభేదాలే కారణంగా తెలుస్తోంది. ఈ మేరకు రజత్ శర్మ ట్వీట్​ చేశారు.

రజత్​ శర్మ ట్వీట్​

"క్రికెట్ పరిపాలన అన్ని సమయాల్లోనూ ఒత్తిడితో ఉంటుంది. క్రికెట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా స్వార్థ ప్రయోజనాలు ఎప్పుడూ పనిచేయవు. నా నిబద్ధత, నిజాయితీ మరియు పారదర్శకత పాలన వల్ల డీడీసీఏలో కొనసాగడం సాధ్యం కావడం లేదు. ఈ విషయాల్లో నేను ఎంతమాత్రం రాజీ పడటానికి ఇష్టపడట్లేదు"
--రజత్​శర్మ, డీడీసీఏ మాజీ అధ్యక్షుడు

అధ్యక్ష హోదాలో విధులు న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చాలా సమస్యలు వస్తున్నాయని.. అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు రజత్​.

మరో ముగ్గురు...

రజత్ శర్మపై ఉన్న గౌరవంతో డీడీసీఏ సీఈఓ రవి చోప్రా, క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ)లో సభ్యులుగా ఉన్న సునీల్ వాల్సన్, యశ్‌పాల్ శర్మ కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అతుల్ వాసన్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కోచ్ కెపీ భాస్కర్... రంజీ ట్రోఫీ జట్టుకు సేవలందిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.

జైట్లీ మద్దతు...

దివంగత మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి క్రియాశీల మద్దతు తర్వాత రజత్ శర్మ... డీడీసీఎ పరిపాలనలో అత్యున్నత స్థాయిని అందుకున్నారు. జైట్లీ చనిపోయిన తర్వాత రజత్​కు డీడీసీఏలో మద్దతు కరవైందని పాలకమండలి సభ్యులు భావిస్తున్నారు.

గతంలో తిహారాపై సస్పెన్షన్​...

డీడీసీఏ ఎన్నికల్లో శర్మ బృందంపై తిహారా గెలిచాడు. అయితే అధ్యక్ష పదవిలో ఉన్న శర్మతో కొన్ని పాలనాపరమైన విభేదాలు, ప్రోటోకాల్​ పాటించకుండా నియామకాలను చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం వల్ల అతడిపై వేటు వేసింది పాలకమండలి కమిటీ. కోర్టును ఆశ్రయించి మళ్లీ ప్రధాన కార్యదర్శి పదవిలో చేరాడు తిహారా.

డిసెంబర్​ 1 తర్వాత ముంబయిలో జరగనున్న వార్షిక బీసీసీఐ సమావేశంలో.. ఈ అంశంపై తదుపరి కార్యచరణ చేపట్టే అవకాశం ఉంది.

Last Updated : Nov 16, 2019, 11:16 PM IST

ABOUT THE AUTHOR

...view details